– కేటీఆర్ ను సీఎం చేయాలన్నదే కేసీఆర్ తాపత్రయం
– బీఆర్ఎస్ కు జెండా లేదు.. ఎజెండా లేదు
– కేసీఆర్ టూరిస్ట్ గా మారిపోయారు
– గతంలో జాతీయ పార్టీలను తిట్టి…
– ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని బీఆర్ఎస్ ప్రకటించారు
– దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి రండి..
– కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్
రాష్ట్రంలో చెల్లని రూపాయి దేశంలో చెల్లుతుందా అని బీఆర్ఎస్ ను ఉద్దేశించి మాట్లాడారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. గేదెకు సున్నమేసినంత మాత్రాన ఆవు కాదు అంటూ ఎద్దేవ చేశారు. కేసీఆర్ అక్రమ సంపాదన గురించి ప్రజలకు అర్థమైందని.. ప్రజల దృష్టిని మరల్చడానికే జాతీయ పార్టీ అంటూ నాటకమాడుతున్నారని మండిపడ్డారు. ఐదేళ్ల పాటు కేసీఆర్ కేబినేట్ లో ఒక్క మహిళ కూడా లేరు కానీ.. ఇప్పుడు మహిళా సాధికారిత అంటూ ఏవేవో మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశంలో విమానం కొన్న ఖ్యాతి కేసీఆర్, కేఏ పాల్ కే దక్కిందన్న సంజయ్.. త్వరలో ఆ ఇద్దరు నాయకులు కలిసి పని చేస్తారేమో అని సెటైర్లు వేశారు.
జాతీయ రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా తాము స్వాగతిస్తామని.. కేసీఆర్ ప్రకటించిన జాతీయ పార్టీకి ఒక జెండా, అజెండా లేదని విమర్శించారు సంజయ్. భారత్ రాష్ట్ర సమితి అంటే అర్థమేమిటో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ ప్రారంభించినప్పుడు పార్టీలో ఉన్న వాళ్లలో ప్రస్తుతం ఎంతమంది ఇంకా అదే పార్టీలో కొనసాగుతున్నారో చెప్పాలన్నారు. ఏ ఉద్దేశంతో ఈ జాతీయ పార్టీ తెరపైకి తెచ్చారో కేసీఆర్ ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి ఓట్లు వేశారని.. కానీ ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ అని పేరు మార్చారని ఆరోపించారు.
కేసీఆర్ కు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదన్నారు బండి. ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం ఉంటే వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేసి బీఆర్‌ఎస్ పేరుతో ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. కుమారుడిని సీఎం చేయడానికే కేసీఆర్ జాతీయ పార్టీ పేరుతో డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. గతంలో జాతీయ పార్టీలను తిట్టిన కేసీఆర్… ఇవాళ ఏ ముఖం పెట్టుకొని జాతీయ పార్టీ అని అంటున్నారని నిలదీశారు. బీజేపీకి వ్యతిరేకంగా కుట్రలతోనే ఈ జాతీయ పార్టీ అంటూ విమర్శించారు. కనీసం సొంత పార్టీ నాయకుల అభిప్రాయాలు కూడా తీసుకోకుండా ప్రకటించారని ఆరోపించారు.
బుధవారం నాటి టీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్‌లో ఏ ఒక్కరు కూడా సంతోషంగా కూర్చోలేదని అన్నారు సంజయ్. తెలంగాణలో టీఆర్ఎస్ బండారం బయటపడుతుందనే జాతీయ పార్టీ నాటకం ఆడుతున్నారన్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రపతిగా ఎస్టీ మహిళ పోటీ చేస్తుంటే ఓటమికి యత్నించారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 17.50 లక్షల ఎస్సీ కుటుంబాలు ఉన్నాయని.. ప్రభుత్వం దళిత బంధు 8.4 లక్షల కుటుంబాలకు ఇచ్చిన్నట్లు గొప్పలు చెప్పుకుంటోందని ఫైరయ్యారు. దళితబంధు ఎందరికి ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రాన్ని దోచుకుని.. బీఆర్ఎస్ పేరుతో ఇక దేశాన్ని దోచుకునేందుకు వెళ్తున్నారని ఆరోపించారు. కుట్రపూరితంగానే జాతీయ పార్టీని కేసీఆర్ ఏర్పాటు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడులో ఏ పార్టీ తరుఫున పోటీ చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణకు ఎందరో టూరిస్టులుగా వస్తారని చెప్పి.. ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టి కేసీఆర్ టూరిస్టుగా మారారని ఎద్దేవ చేశారు బండి సంజయ్.