కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఈ బడ్జెట్ విప్లవాత్మకం.. రాబోయే పాతికేళ్ల దేశ భవిష్యత్ కు అద్దం పడుతోందని కొనియాడారు. స్వదేశీ వ్యాక్సిన్ తో కరోనాను కట్టడి చేసిన మోడీ ప్రభుత్వం.. ‘ఆత్మ నిర్భర్’ వ్యాక్సిన్ తో ఆర్థిక సుస్థిరత సాధించడం చారిత్రాత్మకమని చెప్పారు.
ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ ప్రజలపై భారం మోపకుండా పన్నుల రహిత బడ్జెట్ ను రూపొందించడం సాహసోపేతమన్నారు బండి. ఎన్నికల రాజకీయాలతో పనిలేకుండా దేశ హితమే లక్ష్యంగా దీర్ఘకాల లక్ష్యాలతో ఈ బడ్జెట్ ను రూపొందించారని ప్రశంసించారు.
ఎస్ఎంఈ, ఎంఎస్ఎం రంగాలకు రూ.6 లక్షల కోట్ల ప్రోత్సాహకాలతో కోట్లాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని చెప్పారు సంజయ్. ఇంతటి సాహసోపేత బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు సెల్యూట్ చేశారు.
అన్ని రంగాలను సమదృష్టిలో చూడటం కత్తిమీద సాములాంటిదన్నారు బండి. అయినప్పటికీ వాటిని సునాయసంగా అధిగమిస్తూ అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ ను రూపొందించడం గర్వకారణమని తెలిపారు.