బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగుతోంది. సోమవారం ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు పోలీసులు. గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో పార్టీ శ్రేణులతో కలిసి పాదయాత్ర చేస్తున్నారు బండి. ఈ సందర్భంగా వెళ్లిన ప్రతీచోటా టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు.
సీఎం కేసీఆర్ తన ఫాంహౌస్ లో వాడే కరెంట్ తో 30 గ్రామాలకు ఉచితంగా కరెంట్ సరఫరా చేయొచ్చని విమర్శించారు బండి. విద్యుత్ ఛార్జీల పెంపుతో సామాన్యులపై ప్రభుత్వం భారం మోపి సామాన్యుల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అమలు చేస్తూ.. ఇళ్లకు మాత్రం ఛార్జీలను పెంచి వసూలు చేస్తోందని ఆరోపించారు.
కేసీఆర్ తన ఫాంహౌస్ కోసం ఫ్రీగా కరెంట్ వాడుకుంటున్నారని విమర్శించారు బండి. అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులకు చెందిన ఫాంహౌస్ లలో ఒక్కొక్కరికి 30 కనెక్షన్లు ఉన్నాయని ఆరోపించారు. వారంతా వాడే కరెంట్ తో వంద గ్రామాలకు ఉచితంగా కరెంట్ ఇవ్వొచ్చని చెప్పారు. ఊర్లో కాలేజీ ఉండదు.. హాస్పిటల్ ఉండదు కానీ… కేసీఆర్ షాప్ మాత్రం పక్కా ఉంటుందని మద్యం అమ్మకాలను ఉద్దేశించి విమర్శించారు.
విద్యుత్ చార్జీలు ఎందుకు పెంచారో కేసీఆర్ సమాధానం చెప్పకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు సంజయ్. రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలు స్థాపించారో, ఎన్ని ఉద్యోగాలిచ్చారో స్పష్టం చేస్తే కేసీఆర్ కు వందనం చేస్తానన్నారు. తప్పులు చెబితే మాత్రం బడిత పూజ చేస్తానని హెచ్చరించారు. పాలమూరు కరవును, వలసల్ని ప్రత్యక్షంగా చూస్తుంటే గుండె తరుక్కు పోతుందన్న బండి… సరైన సమయంలోనే తాను పాదయాత్ర చేస్తున్నానని అన్నారు.
రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఇప్పటివరకు ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు, పెన్షన్ డబ్బులు వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు అమలు చేయడం లేదన్నారు. తుంగభద్ర, కృష్ణానది నడుమ ఉన్న నడిగడ్డపై వెయ్యికోట్లు ఖర్చుపెడితే.. నెట్టెంపాడు, ఆర్డీఎస్ పనులు పూర్తై ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. ఫాంహౌస్ కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి నుంచి సాగునీళ్లు తెచ్చుకున్న కేసీఆర్.. నడిగడ్డ ప్రజలకు నీరిచ్చేందుకు మనసు రావడం లేదని విమర్శించారు.
ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన సహా పలు పథకాలు కేంద్రం పేదవారి కోసం అమలు చేస్తుంటే.. మోడీకి పేరొస్తుందన్న అక్కసుతో రాష్ట్రంలో అమలు చేయడం లేదని ఆరోపించారు సంజయ్. కేంద్రం ఇచ్చే నిధుల్ని వాడుకుంటూ టీఆర్‌ఎస్ లబ్ది పొందే ప్రయత్నం చేస్తోందని ఫైరయ్యారు. కేసీఆర్ అవినీతి, అరాచక పాలన అంతం కావాలంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలన్నారు బండి సంజయ్.