– రామమందిరానికి అనుకూలమో కాదో..
– కేసీఆర్, కవిత చెప్పాలి
– రాజకీయాల కోసం జై హనుమాన్ అంటారా?
– దేవుడు క్షమించడు!
– మరోసారి బండి ఫైర్
రాజకీయాల కోసం జై హనుమాన్ అంటే దేవుడు క్షమించడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీది జైశ్రీరాం అయితే.. తమది జై హనుమాన్ అని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన స్పందించారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ.. రామమందిర నిర్మాణానికి అనుకులమో లేదో అయ్యా, బిడ్డ చెప్పాలని డిమాండ్ చేశారు.
బీజేపీ వల్లే.. తాను హిందువును అని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారని చెప్పారు బండి. టీఆర్ఎస్ వాళ్లు జై హనుమాన్ అంటున్నారంటే అది బీజేపీ గొప్పతనం అని తెలిపారు. ప్రధాని మోడీ గొప్ప నిర్ణయాలతో దేశాన్ని బలోపేతం చేస్తున్నారని చెప్పారు. ప్రజా శేయస్సు కోసం మోడీ అహర్నిశలు కష్టపడుతున్నారని కొనియాడారు.
కేసీఆర్ ఇచ్చిన చెక్కులు చెల్లుతాయో లేదో అని పంజాబ్ రైతులకు అనుమానం ఉందని.. డ్రా చేసేదాకా వాటిని తీసుకున్న లబ్దిదారులకు టెన్షనే అని అన్నారు సంజయ్. ఫాంహౌస్ నుంచి కేసీఆర్ బయటకు రావడమే అతిపెద్ద సంచలనమని వ్యాఖ్యానించారు. దేశ యాత్రలతో కేసీఆర్ సాధించేది ఏమీ ఉండదని సెటైర్లు వేశారు.
జీతాలు ఇవ్వడం లేదు, పెన్షన్ లు అందడం లేదు.. రాష్ట్రంలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు సంజయ్. పెట్రోల్ పై వ్యాట్ తో రాష్ట్ర ప్రభుత్వం రూ.60వేల కోట్లు సంపాదించిందని అన్నారు. కేంద్రం సహకరిస్తున్నా.. అబద్దాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లు సవ్యంగా సాగడం లేదని.. దాని గురించి ఆలోచించకుండా.. పంజాబ్ వెళ్తారా? అంటూ ఫైరయ్యారు. కరీంనగర్ లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు బండి. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలన్నారు. అభివృద్ధి విషయంలో తన వంతుగా ఏం చేయాలో చేస్తానని చెప్పారు.