సీఎం కేసీఆర్‌పై బీజేపీ తెలంగాణ చీఫ్, ఎంపీ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బతికినన్నాళ్లు జయశంకర్ సార్, కొండా లక్ష్మణ్ బాపూజీలను కేసీఆర్ అవమానించారని ఆయన అన్నారు. కానీ వాళ్లు చనిపోయాక ఇప్పుడు వారిని కేసీఆర్ కీర్తిస్తున్నారని చెప్పారు.
కన్నతల్లిని కూడా చంపి, దండేసి కీర్తించే బాపతు కేసీఆర్ అని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని, గాంధీజీ గ్రామ స్వరాజ్యాన్నికూడా సీఎం నీర్వీర్యం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అసెంబ్లీలో మాత్రం వారిద్దరినీ ఆకాశానికెత్తుతున్నారన్నారు.
వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు నిరూపించే దమ్ముందా? అంటూ ఆయన సవాల్ విసిరారు. మొక్కలు ఎండిపోతే సర్పంచ్‌ను సస్పెండ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాంటప్పుడు కేసీఆర్ ను ఎందుకు సస్పెండ్ చేయకూడదన్నారు.
సర్పంచ్‌లు సహా ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థను కేసీఆర్ సర్వనాశనం చేశారని ఆయన ఫైర్ అయ్యారు. కేసీఆర్‌కు నిజంగా దమ్ముంటే పంచాయతీలకు కేంద్ర, రాష్ట్రాలు ఇస్తున్న నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు.
రామరాజ్యం కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. మహిళల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.