గడీల పాలనను బద్దలు కొట్టేందుకు ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నట్లు తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. పాదయాత్రలో భాగంగా మెదక్ జిల్లా రంగంపేట్ లో ప్రసంగించారాయన. పేదల ప్రభుత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. కేంద్రం తెలంగాణకు ఇస్తున్న నిధులతోపాటు కేసీఆర్ చేస్తున్న మోసాలను ఎండగట్టేందుకే యాత్ర చేపట్టినట్లు వివరించారు. తలాపున మంజీరా నది పారుతోంది కానీ.. జిల్లాలో ఒక్క ప్రాజెక్టు లేదని… తాగడానికి నీళ్లు లేవన్నారు. కేసీఆర్ మాత్రం లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెబుతారని సెటైర్లు వేశారు.
టీఆర్ఎస్ పాలనలో రైతులు గోస పడుతున్నారని విమర్శించారు బండి. పంట నష్టపోతే మోడీ ఇచ్చే రైతు కిసాన్ సమ్మాన్, సబ్సిడీలు తప్ప కేసీఆర్ ఇచ్చేదేమీ లేదని ఆరోపించారు. రుణమాఫీ అన్నారు.. ఫ్రీ ఎరువులన్నారు.. సీఎం ఏమీ ఇవ్వలేదని విమర్శలు చేశారు. అదే మోడీ ప్రభుత్వం ముడి ధరలు పెరిగినా ఎరువుల భారం పడకుండా పాత ధరకే రైతులకు అందజేస్తోందని చెప్పారు. అన్ని పథకాలకు కేంద్రమే నిధులిస్తోందన్న బండి… కేసీఆర్ మాత్రం తన పేరు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.
ఆయుష్మాన్ భారత్ దరిద్రపు స్కీం అన్న కేసీఆర్.. అదే నిజమైతే ఆరోగ్యశ్రీలో కోవిడ్ ను ఎందుకు చేర్చలేదో చెప్పాలని సవాల్ విసిరారు. కోవిడ్ తో దేశమంతా అల్లాడుతుంటే ఆదుకున్న స్కీం ఆయుష్మాన్ భారత్ అని చెప్పారు. కానీ.. రాష్ట్రంలో దీనిని అమలు చేయకపోవడం వల్ల పేదలు పిట్టల్లా రాలిపోయారని… ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాల్లేక పట్టించుకునే దిక్కులేక అనేక మంది ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. పేదలు ఇబ్బందుల్లో ఉంటే రారు.. ఆర్టీసీ కార్మికులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయినా పట్టించుకోరు.. కరోనాతో జనం చచ్చినా కేసీఆర్ బయటకు రాలేదని విమర్శించారు. బీజేపీ మాత్రం ప్రజల వద్దకొస్తోంది.. వారి బాధలు విని పోరాడుతోందని అన్నారు బండి.
కేంద్రం 2.91 లక్షల ఇళ్లను తెలంగాణకు మంజూరు చేసి రూ.10 వేల కోట్లు కేటాయిస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఒక్క ఇల్లు కూడా కట్టించకుండా పేదలను మోసం చేస్తోందని ఆరోపించారు. జిల్లాలో ఎంతమందికి డబుల్ బెడ్రూం ఇళ్లు వచ్చాయో చెప్పాలన్నారు. కేంద్రానికి 2.91 లక్షలు కాదు.. అవసరమైతే 10 లక్షల ఇళ్లు మంజూరు చేసే దమ్ము ఉంది. మరి.. వాటిని కట్టించి ఇచ్చే దమ్ము కేసీఆర్ కు ఉందా అని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగోమన్న సీఎం ఎంతమందికి ఉద్యోగాలిచ్చారని నిలదీశారు. ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారో చెప్పాలన్నారు. కేసీఆర్ ఒక్కో నిరుద్యోగికి లక్ష రూపాయల బాకీ ఉన్నారని అన్నారు బండి సంజయ్.
ధనిక రాష్ట్రమైన తెలంగాణను దివాలా తీయించిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు. రూ.4 లక్షల కోట్ల అప్పులు చేశారు.. ప్రస్తుతం ఒక్కో తలపై లక్ష రూపాయల అప్పు ఉంది.. కనీసం జీతాలు కూడా ఇయ్యలేని ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని విమర్శలు చేశారు. దళితులకు, పేదలకు ఇళ్లు ఇవ్వడం లేదు కానీ.. 100 రూములతో విలాసవంతమైన ప్రగతి భవనాన్ని కేసీఆర్ కట్టుకున్నారని మండిపడ్డారు. తలకిందులుగా తపస్సు చేసినా హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలవదన్నారు. దళిత బంధుతోపాలు బీసీ బంధు, గిరిజన బంధు కూడా ఇయ్యాలని డిమాండ్ చేశారు బండి.
రాష్ట్రం కోసం 14వందల మంది బలిదానాలు చేసుకున్నారు.. ఇందుకోసమేనా తెలంగాణ సాధించుకుందని అమరుల కుటుంబాలు ఘోషిస్తున్నాయి.. ఎక్కడికి వెళ్లినా కేసీఆర్ ను గద్దె దించాలని కోరుతున్నారని వివరించారు బండి సంజయ్. నర్సాపూర్ నియోజకవర్గానికి కేంద్రం ఉపాధి హామీ కూలీ కోసం రూ. 183.65 కోట్లు, అభివృద్ధి పనుల కోసం రూ. 87.30 కోట్లు, మొక్కల పెంపకం, పశుగ్రాసం కోసం రూ.44.19 కోట్లు, ఆర్థిక సంఘం ద్వారా రూ. 78.88 కోట్లు, స్వచ్ఛ భారత్ మిషన్ పేరిట రూ. 19.76 కోట్లు, మున్సిపాలిటీకి రూ. 2.06 కోట్లు ఇచ్చినట్లు వివరించారు. ఈ లెక్కలన్నీ తప్పయితే తనపై కేసు పెట్టుకోవచ్చని సవాల్ విసిరారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తరువాత అమిత్ షా దగ్గరకు వెళ్లిన కేసీఆర్.. మేయర్ పదవి ఆఫర్ చేశారని అన్నారు బండి. మీ పదవులు మాకెందుకు.. 2023లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరేసి అధికారంలోకి వస్తామని అమిత్ షా చెప్పినట్లు తెలిపారు. కొందరు కావాలనే టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ ను పొలిమేర దాటేదాకా తరిమితరిమి కొట్టే పార్టీ బీజేపీ ఒక్కటేనన్నారు. రాష్ట్రంలో రోడ్లు, నీళ్లు, టాయిలెట్లు, స్మశానవాటికలు సహా అన్ని పథకాలకు కేంద్రం నిధులిచ్చిందని.. అవన్నీ కేవలం హిందువులకే ఇవ్వలేదని వివరించారు. అందరికీ ఇచ్చామన్న ఆయన.. బీజేపీ అసలు సిసలైన సెక్యూలర్ పార్టీ అని చెప్పారు.
ఇక హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం జరిపి తీరతామన్నారు బండి. సీఎం దీనిపై స్పందించాలని.. కోర్టును ఆశ్రయించాలని సూచించారు. హిందువులకు పర్మిషన్లు తీసుకుని పండుగలు చేసుకునే పరిస్థితి వచ్చిందని.. ఒక్కసారి ప్రజలంతా ఆలోచించాలని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం, వారి సమస్యల కోసం లాఠీ దెబ్బలు తిన్న పార్టీ బీజేపీనే అన్న ఆయన… జైళ్లో పెట్టినా, రౌడీ షీట్లు ఓపెన్ చేసినా భయపడేది లేదని స్పష్టంచేశారు. ఎత్తిన జెండా దించకుండా కాషాయ జెండాను భుజాన వేసుకుని గొల్లకొండ(గోల్కొండ) ఖిల్లామీద కాషాయ జెండాను ఎగరేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు బండి సంజయ్.
రంగంపేట్ బహిరంగసభలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత విజయశాంతి మాట్లాడుతూ.. టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటేనని ఆరోపించారు. ఢిల్లీలో కాంగ్రెస్ లేదు.. గల్లీలోనూ లేదు. ఎమ్మెల్యేలను అమ్ముకునే స్థాయికి దిగజారిందని విమర్శలు చేశారు. ప్యాకేజ్ అండ్ ఎక్స్ చేంజ్ పార్టీగా మారిందని.. ఎమ్మెల్యేలను ఇస్తామని కాంగ్రెస్ అంటే ప్యాకేజ్ ఇస్తానని కేసీఆర్ ఆఫర్ ఇస్తున్నట్లుగా చెప్పారు. ఏడేళ్లుగా 4 కోట్ల ప్రజలను పట్టిపీడుస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నట్లు వివరించారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వాటిని పరిష్కరించుకునేందుకే ఈ పాదయాత్ర అంటూ చెప్పుకొచ్చారు విజయశాంతి.