మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యకు కుట్ర జరిగిందంటూ కేసీఆర్ రూపొందించిన సినిమా అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈ సినిమాలో నటీనటులంతా జీవించినా… కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా ఫెయిలైందని చెప్పారు. కొందరు ఐపీఎస్ లు వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే బాధ కలుగుతోందని… రాష్ట్ర ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు పోలీసులంటే గౌరవం లేకుండా పోతోందన్నారు.
ప్రభుత్వాలు ఏవీ శాశ్వతం కాదన్న బండి… పోలీసులు చట్టాన్ని కాపాడుతూ నిజాయితీగా వ్యవహరించాలని సూచించారు. చట్టాన్ని ధిక్కరిస్తే ఇన్వెస్టిగేషన్ చేసే అధికారులే బలౌతారనే విషయాన్ని మర్చిపోకూడదని హెచ్చరించారు. డీకే అరుణ, జితేందర్ రెడ్డి మీద వస్తున్న కథనాలు, మీడియాలో వస్తున్న వార్తలతోపాటు వారి ఇండ్లపై జరిగిన దాడిని చూస్తే బాధేస్తోందన్నారు. జిల్లా అభివృద్ధి కోసం ఏళ్ల తరబడి కృషి చేసిన వారిని హత్య కేసుకు ముడిపెట్టి కథనాలు రాయడం దారుణమని చెప్పారు.
“జితేందర్ రెడ్డి సౌమ్యుడు. ఇచ్చిన బాధ్యతను తప్పకుండా నిర్వర్తించే వ్యక్తి. రెండుసార్లు ఎంపీగా కొనసాగారు. గతంలో కేసీఆర్ వద్ద కూడా ఉన్నారు. ఆ సమయంలో ఎన్ని కుట్రలు చేసిండు? ఎంతమందిని హత్య చేసిండో కేసీఆర్ చెప్పాలి. ఇకనైనా ఆధారాల్లేకుండా సీనియర్ నేతల వ్యక్తిత్వాన్ని చంపేసేలా కథనాలు రాయకూడదని కోరుతున్నా. ఎఫ్ఐఆర్ లోగానీ, రిమాండ్ రిపోర్ట్ లో గానీ ఎక్కడా వారి పేర్లు రాలేదు. కానీ.. రాత్రి నుండి టీఆర్ఎస్ నేతలు, మీడియాలో డీకే అరుణ, జితేందర్ రెడ్డిలపై ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తున్నారు. ఆరోపణలు చేసిన టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు తలకాయ యాడ పెట్టుకుంటరు? కేవలం బీజేపీని అప్రదిష్టపాల్జేయడానికి మాత్రమే సీఎం డైరెక్షన్ లో పన్నిన కుట్ర ఇదని స్పష్టంగా అర్ధమవుతోంది” అని మండిపడ్డారు.
అవినీతి ఆరోపణలున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కాపాడటంలో భాగంగా సీఎం ఒక తప్పు చేయబోయి మరిన్ని చేస్తున్నట్లు స్పష్టమైందన్నారు బండి. బీజేపీ హత్యా రాజకీయాలను ఎన్నటికీ సమర్ధించదని… మంత్రిపైనే కాదు… మామూలు వ్యక్తిపై హత్యకు కుట్ర చేసినా తప్పేనన్నారు. కానీ.. ఎవరైతే మంత్రి అవినీతి, అక్రమాలపైన పూర్తి ఆధారాలతో సహా కోర్టులను, ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించారో.. ఎవరైతే తమను హత్య చేసే కుట్ర జరుగుతోందని, తమకు రక్షణ కల్పించాలని మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారో.. చివరకు వాళ్లే శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర చేశారంటూ పోలీసులు కేసు పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోందని చెప్పారు. కోర్టులో నిజానిజాలు తేలుతాయన్నారు.
శ్రీనివాస్ గౌడ్ అక్రమాలు, భూ కబ్జాల గురించి మహబూబ్ నగర్ ప్రజలందరికీ తెలుసన్న బండి… అందుకే టీఆర్ఎస్ ను ఛీదరించుకుంటున్నరని విమర్శించారు. సీఎం చేసిన సర్వేలన్నింట్లో అవే రిపోర్టులొస్తుండటంతో దానిని దారి మళ్లించి బీజేపీని బద్నాం చేయడానికి ఆడిన డ్రామాగా ఇది కనిపిస్తోందన్నారు. అందుకే సోషల్ మీడియాలో పోస్టింగ్ చేసే వారిపైన, అమాయకులపైన కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
“స్థానిక మంత్రి అక్రమాలు, భూ దందాలు, ఇసుక దందాలు తెలియని దెవరికి? చివరకు తనకు కప్పం కట్టకపోతే మహబూబ్ నగర్ జిల్లాలో ఏ వ్యాపారులు చేసుకునే పరిస్థితి కూడా లేదు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతల అక్రమాలకు అంతే లేకుండా పోతోంది. బెదిరింపుల్లో, అత్యాచారాల్లో, భూ కబ్జాల్లో, హత్యల్లో.. ఇలా ఇందుగలడందు లేదనే విధంగా ఎక్కడ చూసినా టీఆర్ఎస్ నేతలే కనిపిస్తున్నారు. నిర్మల్ లో సాజిద్ ఖాన్ అనే వ్యక్తి 16 ఏళ్ల హిందూ బాలికను డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పిస్తానని ఆశ చూపి రెండు రోజులపాటు దారుణం చేస్తే వాడిని పట్టుకోవడానికి పోలీసులకు చేత కాలేదు. వారం రోజులు పట్టింది. కానీ మంత్రిని హత్య చేస్తానికి కుట్ర పన్నారంటూ వీళ్లను మాత్రం ఒక్కరోజులోనే ఢిల్లీ పోయి పట్టుకొచ్చిండ్రు. ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రం వెళ్లినప్పుడు… అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చి ఆరోపణలున్న వారిని అదుపులోకి తీసుకోవాలి. కానీ.. అదేమీ చేయకుండా కనీసం కోర్టు నుండి ట్రాన్సిట్ వారెంట్ కూడా తీసుకోకుండా చెప్పాపెట్టకుండా కిడ్నాప్ చేసి తీసుకొచ్చారంటే ఈ సమాజానికి పోలీసులు ఏం చెప్పాలనుకుంటున్నారు?” అని ప్రశ్నించారు.
మాకేం చెప్పొద్దు… మేం బరి తెగించి ఉన్నాం… మేం ఏం చేసినా ఎవరూ అడిగే వారు లేరు… ఏదైనా జరిగితే మమ్ముల్ని సీఎం కాపాడాతరనే ఉద్దేశంతో ఇష్టమొచ్చినట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అందుకే రాష్ట్ర పోలీసుల తీరుపై ఫిర్యాదు చేస్తే ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పారు. ఈ విచారణను తెలంగాణ పోలీసులు ఎదుర్కోవాల్సి వస్తుందనే కనీస సోయి కూడా లేదా?.. అసలు జితేందర్ రెడ్డి ఇంటిపై దాడి చేసి కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏందని నిలదీశారు. చివరకు ఈ ఎపిసోడ్ పై ఫిర్యాదు చేసిన జితేందర్ రెడ్డి పీఏ రాజును కూడా కేసులో ఇరికించే కుట్ర చేయడమేంటని ప్రశ్నించారు. ఆయనను కూడా విచారణకు రావాలంటూ నోటీసులివ్వడం సిగ్గుచేటన్నారు.
చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే ధిక్కరిస్తున్నారని ఆరోపించారు సంజయ్. ఇంటిపై దాడి చేసి సంబంధం లేని వ్యక్తులను కిడ్నాప్ చేసి కొట్టి బలవంతం చేస్తుంటే.. వీళ్లు పోలీసు అధికారులు ఎట్లా అయ్యారో అర్ధం కావడం లేదన్నారు. “సైబరాబాద్ సీపీ ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే… జనం నవ్వుకున్నారని.. పాపం ఆయన మాత్రం ఏం జేస్తడు. పైవాళ్లు చెప్పినట్లు చెప్పలేక నానా ఇబ్బంది పడ్డట్లు కన్పించింది. పోలీసులు రూపొందించిన రిమాండ్ రిపోర్ట్ చూస్తే ఎన్ని కథలల్లారో అర్ధమవుతోంది. సీఎం పూర్తి డిప్రెషన్ లో ఉన్నట్లుంది. బహుశా ఏ సర్వే చూసినా జనం బీజేపీవైపు కన్పిస్తున్నరు. ఏం చేయాలో అర్ధం కాక ఈ డ్రామా ఆడినట్లున్నరు. పైగా ఏ ఎమ్మెల్యే, మంత్రిపై చూసినా అవినీతి ఆరోపణలే. సీఎంపై కూడా అవినీతి ఆరోపణలే. దీనిని ప్రశ్నిస్తున్న, నిలదీస్తున్న ఉద్యమకారులను కుట్ర దారులుగా చిత్రీకరిస్తూ దారి మళ్లించే కుట్రలకు తెరదీస్తున్నరు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి విచారణ జరగాలి. వాస్తవాలు బయటకు రావాలి. ఈ అంశంపై ఉన్నతస్థాయి విచారణ సంస్థలను ఆశ్రయిస్తాం. మొత్తం వ్యవహారం నిగ్గు తేలేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు” అని స్పష్టం చేశారు బండి.
సీఎంకు మంచి సలహాలివ్వాల్సిన స్ట్రాటజిస్టులే ఇలాంటి అరాచకాలు, హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తే ఎట్లా? అని ప్రశ్నించారు సంజయ్. అలాంటి వారిపైనా విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో స్ట్రాటజిస్ట్ పాత్ర ఏంటి? లేక సీఎం స్వయంగా ఈ కుట్రకు తెరదీశారా? అనే దానిపైనా దర్యాప్తు సాగాలని చెప్పారు. బీజేపీ మాత్రం ఇలాంటి కేసులకు భయపడే ప్రసక్తే లేదని.. తెగించి కొట్లాడుతుందని స్పష్టం చేశారు. డీకే అరుణ, జితేందర్ రెడ్డిపై టీఆర్ఎస్ ఏ విధంగా కుట్ర చేసిందో ప్రజలందరూ ఆలోచన చేయాలన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న కుట్రలను అడ్డుకోవాలని… బీజేపికి మద్దతివ్వాలని కోరారు బండి సంజయ్.