బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెడికో ప్రీతి ఘటనపై స్పందించిన ఆయన.. నిందితుడు సైఫ్ ను కాపాడే కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఇది ర్యాగింగ్ మాత్రమే కాదని.. దీని వెనుక లవ్ జిహాద్ కూడా ఉందన్నారు. అందుకే ఈ కేసును నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు.
నిందితుడు సైఫ్ ను కాపాడేందుకు జైలుకు పంపుతున్నారన్న బండి.. హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారని విమర్శలు చేశారు. ఈ ఘటనపై సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలు అంటే కేసీఆర్ కు కోపమని.. సైఫ్ ను మీరు వదిలిపెట్టినా ప్రజలు వదిలిపెట్టరంటూ హెచ్చరించారు.
ఇటు ఈ కేసులో ప్రీతీని సీనియర్ సైఫ్ వేధించినట్లు సీపీ రంగనాథ్ తెలిపారు. అతను టార్గెట్ చేసి మరీ వేధించినట్టు తేల్చారు. నాలుగు నెలలుగా ఈ వేధింపులు కొనసాగుతున్నాయని చెప్పారు. నిందితుడు సైఫ్ ను కోర్టులో హాజరుపరుస్తామని.. వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టి అవమానించొద్దని ప్రీతి వేడుకున్నా సైఫ్ కనికరం చూపలేదని తెలిపారు.
తనను ప్రశ్నించడాన్ని సైఫ్ సహించలేకపోయాడని ఆ కోపంతోనే ఆమెను టార్గెట్ చేశాడని చెప్పారు సీపీ. అతను వేధించినట్టుగా ఆధారాలు లభించాయని.. వాట్సాప్ గ్రూప్ లలో ప్రీతిని అవమానించేలా మెసేజ్ లు పెట్టాడని వివరించారు. ఈనెల 20న ప్రీతి వేధింపుల గురించి తండ్రికి చెప్పిందని.. 21న ఇద్దర్నీ పిలిచి కాలీజీ యాజమాన్యం విచారించిందని తెలిపారు.