ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి కుట్ర చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. హన్మకొండలోని అభిరామ్ గార్డెన్ లో జరిగిన ఏబీవీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జల నరసయ్య సంస్మరణ సభలో పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బండి.. కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.
మునుగోడులో ఓటుకు రూ.40 వేలు పంచేందుకు టీఆర్ఎస్ సిద్ధమైందన్నారు. ఆధికారం, పోలీస్ యంత్రాంగాన్ని కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. తాగి తందనాలాడటానికే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడులో మకాం వేశారని.. ఫోన్లు ట్యాపింగ్ కోసం ఇజ్రాయిల్ టెక్నాలజీతో ఒప్పందం చేసుకుంది కేసీఆరేనని విమర్శించారు. రాష్ట్ర మంత్రులు ఆ పార్టీ నేతలు బాహాటంగానే దీన్ని చెబుతున్నారని చెప్పారు.
ఇలాంటి నీచపు బుద్ది ఉన్న కేసీఆర్.. బీజేపీపై విమర్శలు చేయడానికి సిగ్గుండాలని అన్నారు సంజయ్. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్ధికి కేసీఆర్ ఆర్థిక సాయం చేస్తున్నారని ఆరోపించారు. మందు, మంది, మంత్రులతో మునుగోడు ఓటర్ల తీర్పును మార్చలేరని.. ఎవరెన్ని కుట్రలు చేసినా బీజేపీ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. మునుగోడులో ముందే వారికి అనుకూలంగా ఉన్న అధికారులను బదిలీలు చేసుకున్నారని విమర్శలు చేశారు బండి సంజయ్.