– 36 రోజులు.. 35 సభలు
– 8 జిల్లాలు.. 19 అసెంబ్లీ నియోజకవర్గాలు
– ముగిసిన తొలిదశ ప్రజా సంగ్రామ యాత్ర
– హుస్నాబాద్ సభలో బండి గర్జన
– ఢిల్లీ నుంచి స్మృతీ ఇరానీ రాక
అడుగడుగునా బ్రహ్మరథం.. ఎక్కడికి వెళ్లినా కాషాయమయం.. 36 రోజులు.. టీఆర్ఎస్ సర్కార్ చెమటలు.. 35 సభలు.. వందల్లో ప్రగతి భవన్ కు విమర్శనాస్త్రాలు.. ఇదీ ఓవరాల్ గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన తొలిదశ ప్రజా సంగ్రామ యాత్ర. ఆగస్టు 28న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తొలి అడుగు వేసిన బండి సంజయ్.. హుస్నాబాద్ వరకు 438 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో ముగింపు సభ హుస్నాబాద్ కు షిఫ్ట్ చేసి.. సక్సెస్ ఫుల్ గా యాత్రను ముగించారు బండి.
ఎంఐఎం తాలిబన్ల రాజ్యం తెస్తానని అంటే.. తాము రజాకార్ల రాజ్యం తెస్తానని టీఆర్ఎస్ చెబుతోందన్నారు బండి సంజయ్. ఆడపిల్లలను చెరబట్టి రాక్షసంగా వ్యవహరించిన తాలిబన్ల, రజాకార్ల రాజ్యం కావాలా..? సంక్షేమ రామరాజ్యం కావాలా..? అని ప్రజలకు సూచించారు. టీఆర్ఎస్ కు ధరణి భరణిగా మారితే.. పేదలకు మాత్రం దెయ్యంలాగా మారిందని మండిపడ్డారు. ఎంతోమంది రైతులకు సొంత భూమి ఉన్నా ధరణి వల్ల పాస్ బుక్స్ రాకుండా ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. లోన్లు రాక వారంతా నానా కష్టాలు పడుతున్నారని వివరించారు.
మాట్లాడితే ధనిక రాష్ట్రమని చెప్పే టీఆర్ఎస్ ప్రభుత్వం.. నిజంగా ధనిక రాష్ట్రమైతే ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రైతులకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. 22 వేల మంది స్వచ్ఛ కార్మికులకు వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదున్నారు. వేలాది మంది ఫీల్డ్ అసిస్టెంట్లను, విద్యా వాలంటీర్లను, స్టాఫ్ నర్సులను ఎందుకు తొలగించారని మండిపడ్డారు. వారంతావచ్చి తమ బాధలు చెబుతుంటే కన్నీళ్లు ఆగలేదని భావోద్వేగానికి లోనయ్యారు బండి.
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకు వేలాది కోట్ల రూపాయల నిధులిస్తుంటే.. ఎక్కడా ప్రధాని ఫోటో పెట్టకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం సొంత ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు బండి. రాష్ట్రంలో రైతులు పండించిన పంటను కూడా అమ్ముకునే పరిస్థితి లేదన్నారు. పోడు భూముల సమస్యతో గిరిజనులు అల్లాడుతున్నారని.. దళితుల పరిస్థితి అయితే ఘోరంగా ఉందని ఆరోపించారు. హుజూరాబాద్ లో ఎన్ని ఫీట్లు చేసినా.. బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. టీఆర్ఎస్ ఎన్ని డబ్బులు పంచినా, ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు బీజేపీ వైపే.. ఈటల గెలుపు ఖాయమేనని ధీమా వ్యక్తం చేశారు.
హిందుగాళ్లు.. బొందుగాళ్లని కేసీఆర్ మాట్లాడితే టీఆర్ఎస్ ను ఇదే కరీంనగర్ జిల్లాలో బొంద పెట్టిన సంగతిని మర్చిపోవద్దని హెచ్చరించారు బండి సంజయ్. టీఆర్ఎస్ పాలనలో కనీసం గణేష్ ఉత్సవాలను కూడా చేసుకోలేని దుస్థితిలో ఉన్నామని గుర్తుచేశారు. ఇతర పండుగలకు వస్తే గిఫ్ట్ లు పంపే టీఆర్ఎస్ ఫ్రభుత్వం.. హిందువుల పండుగలకు ఏమిచ్చారని ప్రశ్నించారు.