– వరదలతో జనం చస్తుంటే.. కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నారు..?
– గ్లామర్ కోసం డ్రగ్స్ వాడుతున్న టీఆర్ఎస్ నేతలు..!
– బీజేపీ అధికారంలోకి రాగానే రక్త పరీక్షలు
– జర్నలిస్టులపై దాడులు జరుగుతుంటే సంఘాలేం చేస్తున్నాయి..?
రాష్ట్రంలో అకాల వర్షాలు, వరదలతో రైతులు, ప్రజలు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి పోయి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అంచనాలు, కమిటీలతో కాలయాపన చేయకుండా యుద్ధ ప్రాతిపదికన రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ముస్లిం ఓటు బ్యాంకు కోసం హిందూ పండుగలకు అనుమతి ఇవ్వకుండా ఆంక్షలు విధించడంపై మండిపడ్డారు. వినాయక చవితి మంటపాలకు అనుమతి ఇవ్వకుండా యువకులపై బైండోవర్ కేసులు పెడుతూ వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల సమస్యను కొని తెచ్చుకోవద్దని డీజీపీని హెచ్చరించారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఇబ్బందులకు గురిచేసినా హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం జరిపి తీరుతామని స్పష్టం చేశారు.
12వ రోజు పాదయాత్రలో భాగంగా సంగారెడ్డి నుండి సుల్తాన్ పూర్ వరకు పాదయాత్ర చేశారు బండి. శివంపేట్ సమీపంలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ కేంద్ర నాయకత్వ సహకారంతో ప్రజా సంగ్రామ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోందని చెప్పారు. ప్రజలు పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారని.. వేలాది మంది కార్యకర్తలు, ప్రజలు చిన్నా పెద్దా తేడా లేకుండా మహిళలతో సహా అందరూ స్వాగతం పలుకుతున్నారని.. తమ బాధలు చెప్పుకుంటున్నారని వివరించారు. ఎక్కడికి వెళ్లినా రైతులు, యువకుల సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావని.. కనీస మద్దతు ధర లేదు.. రుణమాఫీ కాలేదు.. కోల్డ్ స్టోరేజీలు లేవు.. చెరుకు రైతుల పరిస్థితి అయితే అధ్వాన్నంగా ఉందని వివరించారు. ఇతర రాష్ట్రాలకు పోయి పడిగాపులు పడి అమ్ముకునే దుస్ధితి వచ్చిందన్నారు. భారీ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని… కేసీఆర్ ఇక్కడ ఉంటే ఫాంహౌజ్.. లేదంటే ఢిల్లీకి పోతారని విమర్శించారు. ఆయన వల్ల ఒరిగేదేమీ లేదనే సంగతి ప్రజలకు అర్ధమైందన్నారు బండి.
ప్రతీ ఏటా అకాల వర్షాలు, వడగళ్ల వానతో రైతులు నష్టపోతూనే ఉన్నారని చెప్పారు. అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు వారిని ఆదుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. నష్ట పరిహారం అందించలేదు.. కనీసం భరోసా ఇచ్చిన టీఆర్ఎస్ నాయకులే లేరన్నారు. కమిటీలు పంట నష్టం అంచనాల పేరుతో కాలయాపన చేస్తున్నాయే తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. వరదలొస్తే రైతులను ఆదుకోవడానికి ప్రధాని ఫసల్ బీమా పథకాన్ని తీసుకొస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రీమియం కట్టడం లేదని ఆరోపించారు. కేసీఆర్ ఇవ్వరు.. ఇంకొకరిని ఇవ్వనివ్వరు అంటూ సెటైర్లు వేశారు. మాట్లాడితే లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని చెబుతున్నారు.. కేసీఆర్ చెప్పేది నిజమైతే హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు. ప్రజలు ఏం చెబుతున్నారో అప్పుడు తెలుస్తుందన్నారు. ఈ జిల్లాల్లో ఒక్క బొట్టు నీళ్లు కూడా ఇవ్వలేదని విమర్శలు చేశారు. తుపాకీ రాముడులా టోపీ పెట్టుకుని కర్ర పట్టుకుని కేసీఆర్ రైతు వేషం వేసి ఫోజులిస్తారని.. తెలంగాణలో భూసార పరీక్షలకు కేంద్రం రూ.120 కోట్లు ఇస్తే ఏం చేయడం లేదని ఆరోపించారు బండి.
పాదయాత్రలో ఎక్కడికి పోయినా రైతుల సమస్యలతోపాటు.. తమ పిల్లలకు ఉద్యోగాల గురించే అడుగుతున్నారని అన్నారు బండి సంజయ్. ఇంటికో ఉద్యోగమిస్తామని చెప్పిన కేసీఆర్.. ఏ నోటిఫికేషన్లు విడుదల చేయలేదని విమర్శించారు. సంగారెడ్డి జిల్లాలో వందల ఫ్యాక్టరీలున్నాయి కానీ.. స్థానికులకు ఉద్యోగులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దీనిపై కేసీఆర్ స్పందించాలన్నారు. జీతాలు ఇయ్యలేని ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారో చెప్పాలని సవాల్ విసిరారు.
తనని బక్కోడు, గుండోడు అంటూ టీఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్స్ పై స్పందించారు బండి సంజయ్. తనకు జుట్టులేదని.. మీలా విగ్గులు పెట్టుకోవడం చేతకాదంటూ సెటైర్లు వేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ నాయకుల గ్లామర్ సంగతి బయటకు తీస్తామన్నారు. ఎవరెవరు డ్రగ్స్ వాడుతున్నారనే సంగతి అంతా తెలుసని.. తమ ప్రభుత్వం రాగానే రక్త పరీక్షలు చేయించి.. వారి బండారాన్ని బయటపెడతామని షాకింగ్ కామెంట్స్ చేశారు. జుట్టు ఊడకుండా.. అందం పోకుండా డ్రగ్స్ వాడుతున్నదెవరో అందరికీ తెలుసన్నారు బండి సంజయ్.
టీఆర్ఎస్ లో కొందరు నాయకులు బరితెగించి వాడు వీడు అని మాట్లాడుతున్నారని.. తాము కేసీఆర్ గారు అన్నా కూడా తప్పు పడుతున్నారని అన్నారు. ఒకరేమో మమ్ముల్ని ఉరికిస్తారంట.. రండి ఉరికియ్యండి చూద్దాం.. ఇంకొకరేమో రాళ్లతో కొడతారంట.. ప్రజలే టీఆర్ఎస్ నేతలను రాళ్లతో తరిమికొట్టే సమయం దగ్గరకు వచ్చిందని విమర్శలు చేశారు బండి సంజయ్. బీజేపీ ఢిల్లీలోని సిల్లీ పార్టీ అని ఎటకారంగా మాట్లాడుతున్నారని… మాది సిల్లీ పార్టీ అయితే కేసీఆర్ ఢిల్లీకి పోయి పొర్లు దండాలు ఎందుకు పెడుతున్నారని సెటైర్లు వేశారు. బీజేపీ ఢిల్లీ నుండి గల్లీ దాకా విస్తరించిన పార్టీ… టీఆర్ఎస్ గల్లీ దాటి బయటకు వెళ్లలేని పార్టీ అని ఆరోపణలు చేశారు.
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు బండి. ఈ విషయంలో 17న నిర్మల్ లో జరిగే సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నట్లు చెప్పారు. ప్రతీ ఒక్కరు సభకు వచ్చి విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ, టీఆర్ఎస్ ఎప్పుడూ ఒక్కటి కాదన్న ఆయన.. ఏనాడూ కలిసి పోటీ చేయలేదని వివరించారు. కల్వకుంట్ల కుటుంబం జిమ్మిక్కులు అందరూ గమనిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ ను బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేరని.. ఈ ఏడాది నెట్టుకొచ్చినా.. తప్పకుండా ఆయన జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఎవరైనా సొంత పార్టీ గురించి గొప్పగా చెబుతూ ఎమ్మెల్యేలను కాపాడుకుంటారు.. కానీ.. కేసీఆర్ మాత్రం బీజేపీతో కలిసి ఉంటామని బూచీ చూపుతూ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం సిగ్గు చేటన్నారు బండి సంజయ్.
ఇక జర్నలిస్టులపై దాడులు జరుగుతుంటే సంఘాలు ఏం చేస్తున్నాయని.. అవన్నీ ఎవరికి కొమ్ము కాస్తున్నాయని ప్రశ్నించారు బండి. సీఎం మోచేతి నీళ్లు తాగే జర్నలిస్టు సంఘాలున్నాయని ఆరోపించారు. సంఘాలెప్పుడు వాళ్ల సభ్యుల కోసం పనిచేసేలా ఉండాలన్నారు. ఎక్కడో జరిగే వాటిని భూతద్దంలో చూపే జర్నలిస్టు సంఘాలు.. స్వయానా జర్నలిస్టులపై దాడులు చేస్తుంటే సరిగ్గా స్పందించకపోవడం కరెక్ట్ కాదని చెప్పారు. జర్నలిస్టులంతా ఐక్యంగా ఉండాలని.. కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేయడం తప్ప ఇంకేం చేయలేరని అన్నారు బండి సంజయ్.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 12వ రోజు సంగారెడ్డి నుండి సుల్తాన్ పూర్ వరకు పాదయాత్ర చేశారు బండి సంజయ్. ఉదయం 11 గంటలకు మొదలైన పాదయాత్ర రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగింది. ప్రజల ఇబ్బందులు తెలుసుకోవడమే ప్రధాన ఎజెండాగా సాగిన ఈ యాత్రలో ఎవరిని కదిలించినా సమస్యలే ఏకరవు పెట్టారు. వర్షాలకు కూలిపోయిన ఇళ్లు, ఉండటానికి గూడులేక అల్లాడుతున్న ప్రజలు.. భారీ వర్షాలు వరదలతో పంట నష్టపోయి దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు.. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల్లేక నిరాశలో ఉన్న యువకులు అందరూ బండిని కలిసి తమ గోడును వినిపించారు.
సంగారెడ్డి పట్టణంలో పాదయాత్ర ప్రారంభం కాగానే వేలాది మంది కాషాయ దండు బండి వెంట నడిచింది. పట్టణంలో ఎక్కడికెళ్లినా ఆయనకు వేలాది మంది స్వాగతం పలికారు. పూలు చల్లి అభిమానం చాటుకున్నారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి మంగళ హారతులిచ్చారు. ప్రజా సమస్యలపై పూర్తిగా దృష్టి సారించి ముందుకు కదిలారు బండి. దారిలో కర్ర కోత మిషన్ కార్మికులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నారు. పెట్రోల్ బంక్ కార్మికులతో మాట్లాడారు. హనుమాన్ టెంపుల్ వద్ద మత్స్యకారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలువురు తోపుడు బండ్లు, చిరు వ్యాపారులను కలిశారు. కరోనా వల్ల తమ వ్యాపారాలు దెబ్బతిన్నాయని, ప్రభుత్వం ఇంతవరకు ఏ సాయమూ చేయలేదని వారు వాపోయారు.
హనుమాన్ నగర్ మీదుగా బండి సంజయ్ వెళుతుండగా వర్షాలకు కూలిన ఓ ఇంటిని సందర్శించి శంకరమ్మ అనే బాధితురాలిని పరామర్శించారు. శంకరమ్మ, ఆమె కొడుకు నివాసం ఉంటున్న ఒకే ఒక రూం వానలకు కూలిపోయింది. అంతకు ముందు డ్రైనేజీ కోసం ఆ ఇంటి పక్కన జేసీబీతో తవ్వించడంతో సపోర్ట్ లేకుండా పోయిందని, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయిందని వారు వాపోయారు. తమకు ఇల్లు తప్ప మరే ఆధారమూ లేదని, సాయం చేయాలని కోరుతూ స్థానిక కౌన్సిలర్ కు, అధికారులకు ఎంతగా మొరపెట్టుకున్నా ఇంతవరకు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వలేదని, ప్రభుత్వం నుండి ఏ సాయమూ అందడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె సమస్యను ఓపికగా విన్న బండి సంజయ్ బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం పలువురు మహిళలు సంజయ్ ను కలిసి తమకు ఉండటానికి ఇళ్లు లేవని, డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం దరఖాస్తు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు.
పసల్ వాడి గ్రామంలోకి ప్రవేశించగానే నిర్మాణంలో ఉన్న ఉమామహేశ్వర ఆలయంలోకి వెళ్లారు. వేద పండితులు బండి సంజయ్ ని ఆశీర్వదించారు. వైకుంఠపురం వద్దకు రాగానే కర్నాటక ఎంపీ మునిస్వామి సంజయ్ తో కలిసి పాదయాత్ర చేశారు. మరోవైపు బీజేపీ కార్యకర్తలు సంజయ్ ను చూసి ఉత్సాహంతో టపాసులు కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దారిలో సంగారెడ్డి సరస్వతి శిశు మందిర్ కు వెళ్లిన బండి సంజయ్.. అక్కడున్న విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.
పాదయాత్రలో భాగంగా ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులతో బండి సంజయ్ మాట్లాడారు. సదాశివ నగర్ లోకి ప్రవేశించగానే స్థానిక నిరుపేద మహిళలు ఆయన్ను కలిసి తమ సమస్యలు విన్నవించారు. తమకు ఇళ్లు లేవని వాపోయారు. కొందరు వృద్ధులు వచ్చి తమకు ఫించన్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది రోజులు ఓపిక పట్టండి.. బీజేపీ అధికారంలోకి వచ్చాక అండగా ఉంటుందని భరోసానిస్తూ ముందుకు కదిలారు. సదాశివ నగర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బండి సంజయ్… ఫసల్ వాడి గ్రామంలో బీజేపీ జెండా ఎగురవేశారు. స్థానిక గణపతి షుగర్ ఫ్యాక్టరీ వద్ద కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు విన్నారు. అక్కడి నుండి శివంపేట్ వెళ్లిన బండి సంజయ్ మధ్యాహ్న భోజన విరామ సమయంలో మీడియాతో మాట్లాడారు. తిరిగి సాయంత్రం పాదయాత్ర ప్రారంభించి దారిపొడవునా ప్రజలను కలుస్తూ వారిచ్చే వినతి పత్రాలు తీసుకుంటూ సుల్తాన్ పూర్ వైపుగా కదిలారు.
Advertisements