బీఆర్ఎస్ నేతలు ఎప్పుడెప్పుడు ఏ అంశంలో దొరుకుతారా? అని ప్రతిపక్షాలు వెయిట్ చేస్తుంటాయి. తాజాగా మంత్రి కేటీఆర్ ఓ అంశంలో దొరికిపోయారు. దీంతో ప్రతిపక్షాలు దానికి నాలుగు జోడించి విమర్శల దాడికి దిగాయి. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అయితే.. కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ టిల్లు అని సంభోదిస్తూ విమర్శలు చేశారు.
కేటీఆర్ ఏమన్నారంటే..?
దావోస్ పర్యటనలో భాగంగా ఎన్నారైలతో సమావేశం అయ్యాకు కేటీఆర్. పెట్టుబుడల విషయంపై మాట్లాడుతూ.. తీసుకున్న అప్పులను తాము అభివృద్ధికే కేటాయిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా యాదాద్రిపై ప్రత్యేకంగా మాట్లాడారు. యాదాద్రి వంటి ఆలయాన్ని పునఃనిర్మాణం చేసి.. దానికి వెయ్యి కోట్ల ఖర్చు పెడితే అది భవిష్యత్ మీద పెట్టిన పెట్టుబడి కాదా? అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం యాదాద్రికి రోజుకు కోటి రూపాయల హుండీ ఆదాయం వస్తోందన్నారు.
బండి కౌంటర్ ఎటాక్
ఆలయ నిర్మాణాన్ని పెట్టుబడిగా అభివర్ణిస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైరయ్యారు. “కల్వకుంట్ల కుటుంబానికి ఆలయాలు వ్యాపార కేంద్రాలుగా మారాయి. ఇతర రాష్ట్రాల సీఎంలను యాదాద్రికి ఎందుకు తీసుకెళ్తున్నారు. యాదాద్రిని పెట్టుబడి అవకాశంగా చూపేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు” అని ట్విట్టర్ లో మండిపడ్డారు. యాదాద్రికి పెట్టిన ఖర్చును కేటీఆర్ పెట్టుబడి అన్నారని.. హుండీకి రోజుకు రూ.కోటి విరాళాల రాబడి వస్తుందన్నారని మండిపడ్డారు సంజయ్. ఆలయాలను ప్రభుత్వం బిజినెస్ సెంటర్లుగా మార్చిందని విమర్శలు చేశారు. ట్విట్టర్ టిల్లు హ్యాష్ ట్యాగ్ ను కూడా జోడించారు.
మరోవైపు ఇతర బీజేపీ నేతలు కూడా కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ‘‘దేవుడు మీద భక్తి ఉండి ఆలయ అభివృద్ధి చేయాలి.. అంతేగానీ, హుండీలో వచ్చే ఆదాయం కోసమే పెట్టుబడి పెట్టాం’’ అన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదని ఫైరవుతున్నారు.