రాష్ట్రంలో అరాచక పాలనతో బీజేపీ కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. హైదరాబాద్ బర్కత్ పురాలో జరిగిన పాదయాత్ర ప్రిపరేటరీ మీటింగ్ లో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ కు అసలు సిసలు ప్రత్యామ్నాయం బీజేపీయేనన్న బండి.. ఇది మార్పు కోసం జరిగే పోరాటమని అన్నారు.
కాంగ్రెస్ కు తెలంగాణలో సరైన నాయకత్వం లేదని.. బయటి వాళ్లకు ఆరేళ్లపాటు లీజుకిచ్చారని సెటైర్లు వేశారు. పాదయాత్ర ద్వారా బీజేపీ తెలంగాణలో చరిత్ర సృష్టించబోతోందని.. కనీవినీ ఎరగని రీతిలో ఈ యాత్ర ప్రారంభం కాబోతోందని చెప్పారు. జాతీయ నాయకత్వం, కేంద్ర మంత్రులు కూడా పాదయాత్రకు వచ్చి సంఘీభావం తెలపబోతున్నారని అన్నారు.
బీజేపీ నాయకత్వంలో పేదల సంక్షేమ ప్రభుత్వం రావడం తథ్యమని జోస్యం చెప్పారు బండి సంజయ్. పాదయాత్ర ద్వారా తెలంగాణలో పెనుమార్పులు రాబోతున్నాయని.. కిషన్ రెడ్డి చేపట్టబోయే ఆశీర్వాద యాత్రలో ప్రతీ ఒక్క కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.