తెలంగాణలో నియంత, గడీల పాలన నడుస్తోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనే కార్యకర్తలకు అవగాహన కల్పించే అంశంపై హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. కేసీఆర్ మూర్ఖత్వ పాలనలో ప్రజలంతా అల్లాడిపోతున్నారని మండిపడ్డారు.
ప్రశ్నించిన వారిపై లాఠీలు ఝుళిపిస్తున్నారు.. జైల్లో వేస్తున్నారని విమర్శించారు. ఇంకా ఎన్నాళ్లు ఈ లాఠీ దెబ్బలు తిందాం..? ఇంకా ఎన్నాళ్లు త్యాగాలు చేద్దాం..? అధికారమే లక్ష్యంగా తెగించి కొట్లాడాల్సిన సమయం వచ్చిందని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు బండి సంజయ్. కర్నాటక తరహాలో ఉద్యమించి.. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొద్దామని అన్నారు. బీజేపీ కార్యకర్తలంతా రాబోయే రెండేళ్లపాటు తమ పూర్తి సమయాన్ని పార్టీకి కేటాయించాలని కోరారు.
ప్రజలతో మమేకం అయ్యేందుకే పాదయాత్ర చేపట్టానని అన్నారు బండి. బీజేపీ అధ్యక్షుడైన కొత్తలోనే యాత్ర చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. కరోనా, లాక్ డౌన్ వల్ల వాయిదా పడుతూ వచ్చిందని వివరించారు. 2023లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే వరకు దశల వారీగా పాదయాత్రను కొనసాగిస్తానని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే.. 4 కోట్ల ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా రాష్ట్రంలో గడీల, కుటుంబ పాలన కొనసాగుతోందన్నారు. అవినీతి, నియంత పాలనతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
కేసీఆర్ గడీల పాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలంతా ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లుగా చెప్పారు బండి. ఈ నేపథ్యంలోనే ప్రజల ఆకాంక్షలు, బాధలు, కన్నీళ్లను స్వయంగా తెలుసుకోవాలనే లక్ష్యంతో పాదయాత్ర చేస్తున్నట్లు వివరించారు. గడీలను బద్దలు కొట్టడం బీజేపీ వల్లే సాధ్యమన్న ఆయన.. టీఆర్ఎస్ మెడలు వంచి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతామన్నారు. చివరకు ప్రభుత్వం కేంద్రం ఇచ్చే నిధులను కూడా దారి మళ్లిస్తూ.. సొంత పథకాలుగా చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకప్పుడు కర్నాటకలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు మనలాగే ఎన్నో ఉద్యమాలు చేశారని.. అది ఓర్వలేని ఆనాటి పాలకులు కాషాయ జెండాపై కక్ష కట్టి కార్యకర్తలను జైల్లో వేశారని గుర్తుచేశారు. అయినా అక్కడి కార్యకర్తలు బెదరకుండా తెగించి యుద్దం చేశారని.. ఫలితంగానే కర్నాటకలో అధికారంలోకి వచ్చామని వివరించారు. కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలనలో తెలంగాణ తల్లి బందీ అయ్యిందని… ఆ తల్లిని విముక్తి చేయడమే లక్ష్యంగా తెగించి పోరాడాలని పిలుపునిచ్చారు బండి సంజయ్.