– విద్యార్థుల సమస్యలు కనిపించడం లేదా?
– బీజేపీ నేతలను ఎందుకు అడ్డుకుంటున్నారు?
– బాసర ఎవరు వెళ్లినా అరెస్ట్ చేస్తారా?
– టీఆర్ఎస్ కు అధికారం శాశ్వతం కాదు..
– పోలీసులు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి!
– బండి సంజయ్ వార్నింగ్
సమస్యల పరిష్కారం కోసం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మరోసారి ఆందోళన బాట పట్టారు. అయితే.. విద్యార్థులతో మాట్లాడటానికి వెళ్లిన ఎంపీ సోయం బాపూరావును పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. విద్యార్థుల సమస్యలపై బాపురావు ఎన్నోసార్లు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారని అన్నారు. వారి బాధలు వినాలనే ఉద్దేశంతో అక్కడకు వెళితే పోలీసులు అరెస్ట్ చేయడమేంటని మండిపడ్డారు. స్థానిక పార్లమెంట్ సభ్యుడిని అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు.
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోకపోతే.. తాము కూడా వదిలేయాలా అని నిలదీశారు. సోయం బాపూరావును అక్కడి ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్నారని.. అయన్ను ఎలా అరెస్ట్ చేస్తారని ఫైరయ్యారు. విద్యార్థుల ఆందోళనలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నా.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా కాంపౌండ్ వాల్ లోపల విద్యార్థులు నిరసన చేస్తుంటే.. సమస్యలను పరిష్కరించాల్సింది పోయి కించపరిచే విధంగా మంత్రులు మాట్లాడడం సరికాదని హితవు పలికారు.
నాన్ బెయిలబుల్ కేసులు పెడతామని విద్యార్థులను బెదిరిస్తున్నారని ఆరోపించారు బండి. పోలీసులు ఇలా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. పోలీస్ జీపును బీజేపీ కార్యకర్తలపైకి ఎక్కించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. భైంసాలో వ్యవహరించినట్టే పోలీసులు ఉంటామనుకుంటే మూల్యం తప్పదన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యల పట్ల మంత్రులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. చిన్నచిన్న సమస్యలను కూడా పరిష్కరించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని విమర్శించారు.
విద్యార్థుల సమస్యలను తెలుసుకొనేందుకు తాను వెళ్లినా.. ఇతరులు వెళ్లినా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేస్తున్నారని అన్నారు సంజయ్. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి చెప్పినా చలనం లేదని విమర్శించారు. భయపెట్టినా.. విద్యార్థులు వెనకడుగు వేయడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అసలు పాలన ఉందా అని ప్రశ్నించారు. ఇక కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై ప్రశ్నలు సంధించిన బండి.. ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో వెల్లడించాలన్నారు. ఇక్కడ ప్రజలు వరదలు ఇతరత్రా సమస్యలపై కష్టాలు పడుతుంటే ఆయన అవేవీ పట్టించుకోకపోవడం ఏంటని మండిపడ్డారు. ఏం పీకుడు పనుందని ఢిల్లీ పోయారో చెప్పాలన్నారు సంజయ్.