కేసీఆర్ ప్రభుత్వం క్రీడలను నిర్లక్ష్యం చేస్తోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని.. తాము నూతన క్రీడల విధానాన్ని తీసుకొస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తోందని చెప్పారు.
ముషీరాబాద్ సమీపంలో బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ సోదరుడు కోవా శ్రీనివాస్ మెమోరియల్ పేరిట బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు బండి. రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతలు మద్యం తాగిస్తూ హోలీ ఆడుతూ పండుగల స్పూర్తిని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. హిందూ సంస్కృతిని కించపరిచే చేసే కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. అలాంటి వారి విషయంలో హిందూ సోదరులంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ప్రభుత్వ భూమి కనిపిస్తే.. కబ్జాలు చేస్తూ డబ్బులు దండుకుంటూ అపార్ట్ మెంట్లు నిర్మిస్తున్న ఈ రోజుల్లో కోవా శ్రీనివాస్ మెమోరియల్ ట్రస్ట్ పేరుతో లక్ష్మణ్ క్రీడలను ప్రోత్సహిస్తుండటం ఆనందంగా ఉందన్నారు. ఇతర పార్టీలకు, బీజేపీకి ఉన్న తేడా ఇదేనని వివరించారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని.. అప్పుడు టీఆర్ఎస్ హయాంలో కబ్జాకు గురైన భూములన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు సంజయ్. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. నేను, నా కుటుంబం అనే స్వార్ధాన్ని వీడాలని.. నేను మాత్రమే బాగుండాలనే భావన ఏ మాత్రం సరికాదని సూచించారు బండి సంజయ్.