బీజేపీ ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం.. బండి పిలుపు
– కాంగ్రెస్ కు ఓటేస్తే.. టీఆర్ఎస్ కు వేసినట్టే..
– కీలక శాఖలన్నీ కల్వకుంట్ల కుటుంబం దగ్గరే
– అన్నింటా లూటీనే..
– ధరణి పేరుతో భూముల కబ్జా
– తుగ్లక్ నిర్ణయాలతో వ్యవసాయం అస్తవ్యస్థం
– రాష్ట్రాన్ని చూస్తుంటే.. శ్రీలంక అవుతుందని భయమేస్తోంది
– ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
– బీజేపీ ప్రభుత్వం రాగానే ఉచిత విద్య, వైద్యం
– తుక్కుగూడ సభలో బండి సంజయ్
కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. టీఆర్ఎస్ కు వేసినట్లేనని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ తుక్కుగూడలో జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరిగారు బండి. తెలంగాణలో కుటుంబ పాలనను అంతమొందించాలని.. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేసేందుకే అమిత్ షా వచ్చారని చెప్పారు.
నిజాం సమాధికి మోకరిల్లే వ్యక్తికి ఈ గడ్డపై స్థానం లేదన్న సంజయ్.. బీజేపీ అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తామని చెప్పారు. కల్వకుంట్ల కుటుంబ పాలనలో ప్రజలను కాపాడటం కోసమే ప్రజా సంగ్రామ యాత్ర చేశామని.. ప్రాజెక్టుల పేరుతో హామీలు ఇచ్చి రైతాంగాన్ని నానా కష్టాలు పెడుతున్నారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేసీఆర్ పాలన తుగ్లక్ రాజు పరిపాలనను గుర్తు చేస్తోందన్న బండి.. తన తుగ్లక్ నిర్ణయాలతో తెలంగాణ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని కేసీఆర్ ను ఉద్దేశించి ధ్వజమెత్తారు.
రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం లూటీ చేస్తోందని.. ఇటువంటి పాలన కారణంగా రాష్ట్రం మరో శ్రీలంకగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు సంజయ్. కేసీఆర్ కుటుంబం పంచభూతాలను వదలడం లేదని తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే భయమేస్తోందని.. త్వరగా ఎన్నికలు రావాలని కోరుకుంటున్నానని అన్నారు. రాష్ట్రంలో నిలువు నీడలేని ప్రజలు కేసీఆర్ పాలనలో పెరిగిపోయారని.. వారందరికీ బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ‘పీఎం అవాస్ యోజన్’ పథకం కింద సొంత ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.
ఉచిత విద్య, వైద్యాన్ని కూడా రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు బండి. గోల్కొండ ఖిల్లా మీద కాషాయ జెండా ఎగరేయాల్సిందేనని తెలిపారు. అధికార మార్పు జరగాలని ప్రజలు భావిస్తున్నారన్న బండి.. ధరణి పేరుతో ప్రజల భూములను టీఆర్ఎస్ నేతలు లాక్కున్నారని ఆరోపించారు. పాలమూరు ప్రజలు ఇంకా ఎడారి పరిస్థితుల్లోనే ఉన్నారని.. ఆర్డీఎస్ పూర్తి చేసే బాధ్యత బీజేపీదని చెప్పారు. కేసీఆర్ కు ఎత్తిపోతల ప్రాజెక్టులంటేనే ఇష్టమన్న సంజయ్… ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు ఇస్తానని ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఒకసారి వరి వద్దంటారు.. ఒకసారి పత్తి వద్దంటారు.. తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు.
Advertisements