హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జాతీయ జెండాను ఎగురవేశారు. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి.. రాజ్యాంగ స్ఫూర్తితో దేశం శక్తివంతంగా తయారవుతోందని తెలిపారు. కానీ, తెలంగాణలో మాత్రం రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన సాగుతోందని విమర్శలు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానించారని, అలాంటి వ్యక్తికి దేశంలో ఉండే అర్హత లేదన్నారు. అయన్ను దేశం నుంచి బహిష్కరించాలని ఘాటు విమర్శలు చేశారు. అంబేద్కర్ అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించారని… ఆ స్ఫూర్తి ఇప్పటికీ చెక్కు చెదరలేదన్నారు. ప్రధాని మోడీ రాజ్యాంగ స్ఫూర్తితోనే దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
రాజ్యాంగం, గవర్నర్ తమిళిసై పట్ల కేసీఆర్ ప్రభుత్వానికి గౌరవమే లేదని ఆరోపించారు. గణతంత్ర వేడుకలు నిర్వహించాలనే ఆలోచనే ప్రభుత్వానికి లేదని, దేశాన్ని అసహ్యించుకుని, పక్క దేశాలకు వంత పాడుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. పరేడ్ గ్రౌండ్ లో వేడుకలను ఎందుకు నిర్వహించడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పార్టీ మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు బండి. కేసీఆర్ నిజాంలా మారారని ఫైరయ్యారు. స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాలను జరుపుకోనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేయాలని భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్, రాజ్యాంగం, గవర్నర్, కోర్టులు, మహిళలకు ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని మండిపడ్డారు బండి సంజయ్.