మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ కూడా స్పీడ్ పెంచింది. అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించబోతుందని అన్నారు. ఒక్కో ఓటుకు రూ.40వేలు ఇచ్చి మంత్రులను కేసీఆర్ పంపించారని.. టీఆర్ఎస్ ఇచ్చే డబ్బులు తీసుకొని బీజేపీకి ఓటేయాలని ప్రజలను కోరారు.
మంత్రులు మందు, చిందులతో మీటింగ్ లు పెడుతున్నారని.. రాజగోపాల్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఫాంహౌజ్ లో పడుకున్న కేసీఆర్ ను లంకెలపల్లిదాకా గుంజుకొచ్చామని అన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, రుణమాఫీ జరగాలంటే బీజేపీని గెలిపించాలని చెప్పారు.
రాష్ట్రంలోని యువత, ఉద్యోగులు, రైతులు, కార్మికులు, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ పాలనతో తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు సంజయ్. కేసీఆర్ పై ఉన్న కసినంతా ఓటు రూపంలో చూపాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు అప్పులు కట్టకపోతే కేసీఆర్ వాహనాన్ని బ్యాంక్ వాళ్లు తీసుకెళ్లారని అలాంటి వ్యక్తి.. ఇప్పుడు విమానం ఎలా కొంటున్నారని ప్రశ్నించారు. మునుగోడుతో కేసీఆర్ పతనం మొదలైందన్నారు.
డ్రంక్ డ్రైవ్ టెస్ట్ పెట్టి గౌడ్స్ ను రోడ్లపాలు చేశారని.. పద్మశాలీల పరిస్థితి దారుణం ఉందని తెలిపారు. అగ్రవర్ణాల పేదలను కూడా కేసీఆర్ ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబం మొత్తం నాయకులు అయ్యారని విమర్శించారు. ఆయన అవినీతి సొమ్మును మోడీ, అమిత్ షా కక్కిస్తారన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో గట్టుపల్ మండలం వచ్చిందని.. రోడ్డు, పింఛన్లు, గొర్ల యూనిట్, గిరిజన బంధు వచ్చాయని వివరించారు. ఇక మునుగోడు ఎన్నిక ప్రచారంలో ఈ నెల 17నుంచి బండి సంజయ్ పాల్గొననున్నారు.