ప్రధాని నరేంద్ర మోడీ సీఎం కేసీఆర్ కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, చెప్పాల్సిన విషయాలు తెలంగాణ ప్రజలకు చెప్పేశారన్నారు బిజెపి చీఫ్ బండి సంజయ్. బిజెపి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసింది? ఏం చేస్తోంది? అని కేసీఆర్ సంధించిన ప్రశ్నలను కొట్టిపారేస్తూ.. కేసీఆర్ కు సమాధానం చెప్పాల్సిన అవసరం బిజెపి కి లేదంటూ వ్యాఖ్యానించారు.
విజయవాడ వెళ్లేందుకు సోమవారం బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీకి బండి సంజయ్ ఆధ్వర్యంలో వీడ్కోలు పలికారు బిజెపి నేతలు. ఈ సందర్భంగా కేసీఆర్ పై బండి విరుచుకుపడ్డారు.
అసలు ప్రజలకు మొహం చూపించే ధైర్యం లేకనే సీఎం కేసీఆర్ పారిపోతున్నారంటూ సంజయ్ ఎద్దేవా చేశారు. మోడీకి భయపడి, ప్రచార ఆర్భాటం కోసం హైదరాబాద్ నగరమంతా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిందన్నారు. ఈ ప్రచారం కోసం ఖర్చు చేసిన డబ్బంతా ప్రజల సొమ్మేనని.. వాటిని పేద ప్రజల కోసం ఖర్చు పెట్టుంటే బాగుండేదని హితవు పలికారు.
Advertisements
కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత నిన్నటి విజయ సంకల్ప సభతో మరోసారి స్పష్టమైందన్న బండి సంజయ్.. నిన్నటి ప్రధాని సభకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలను తెలంగాణ ప్రజలకు అంకితమిచ్చారు. అయితే విజయ సంకల్ప సభలో నరేంద్ర మోడీ కనీసం కేసీఆర్, టీఆర్ఎస్ పేరును ప్రస్తావించకపోవడంతో రాజకీయంగా చర్చ నడుస్తోంది.