సీఎం కేసీఆర్.. బూతుల వర్సిటీకి వైస్ ఛాన్సలర్ అంటూ సెటైర్లు వేశారు బండి సంజయ్. రాజ్యాంగాన్ని తిరిగి రాయాలన్న కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సీఎం కామెంట్స్ కు వ్యతిరేకంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో నిరసన వ్యక్తం చేశారు బండి. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. రాజ్యాంగం జోలికొస్తే ప్రజలు చూరచూర చేస్తారని కేసీఆర్ ను హెచ్చరించారు.
రాష్ట్రపతి దళితుడైనందునే టీఆర్ఎస్ ఆయన ప్రసంగాన్ని బహిష్కరించిందని ఆరోపించారు బండి. రాజ్యాంగం తిరిగి రాయాలన్న వ్యక్తి తెలంగాణ సీఎంగా ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. కేసీఆర్ ను గద్దె దించేందుకు అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. బీజేపీ బలహీనపరిచే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బీజేపీ అంబేద్కర్ స్ఫూర్తిగా పాలన చేస్తోందని తెలిపారు.
కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం పార్టీ కార్యాలయాల్లో దీక్షలు చేస్తామని వెల్లడించారు బండి సంజయ్. రాజ్యాంగం మారుస్తామని బీజేపీ ఎప్పుడూ చెప్పలేదన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచేది 9 సీట్లు మాత్రమేనని జోస్యం చెప్పారు. జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతోనే కేసీఆర్ విచిత్రంగా మాట్లాడుతున్నారని ఎద్దేవ చేశారు.
మరోసారి సెంటిమెంట్ రెచ్చగొట్టి లబ్ది పొందాలనేది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోందని చెప్పారు సంజయ్. తెలంగాణకు అన్యాయం జరిగితే మోడీని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. కేసీఆర్ అంత అవినీతిపరుడు ఎవరూ ఉండరని అన్నారు. ఈఎస్ఐ స్కాంలో ఆయన పాత్ర ఉందని ఆరోపించారు. తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునే దుస్థితి నెలకొందని. దళితులంటే ఎందుకంత చులకన అని ప్రశ్నించారు.