బీజేపీ ఎవరినీ వదలదని ప్రతి ఒక్కరి అంతు చూస్తుందన్నారు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. హన్మకొండ జిల్లా కమలాపూర్ లోని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రస్తావన తీసుకొచ్చారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మూర్ఖత్వపు బీఆర్ఎస్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈటల విజయం సాధించారని అన్నారు.
ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఈటలకు ప్రోటోకాల్ పాటించడం లేదని విమర్శించారు సంజయ్. ఆయన కాన్వాయ్ పై రాళ్లతో దాడి చేసింది బీఆర్ఎస్ కార్యకర్తలైతే తమ వాళ్లపై కేసులు పెట్టారని అసహనం వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ ఉప ఎన్నికలో వందల కోట్లు, దొంగ ఓట్లు వేయించుకొని గెలవలేదన్నారు. బీఆర్ఎస్ డబ్బులతో ప్రజలను మోసం చేయాలని చూస్తే వారు ఈటలను భారీ మెజార్టీతో గెలిపించారని తెలిపారు.
పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందని.. బీఆర్ఎస్, బీజేపీ ఘర్షణలో జైలుకు వెళ్లి వచ్చిన తమ పార్టీ కార్యకర్తలను సన్మానించారు బండి. పోలీసులు కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు, వారికి కొట్టే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. గూండాలకు తుపాకుల లైసెన్సు ఇస్తారా? అని నిలదీశారు. ఈనెల 5న బీఆర్ఎస్ గూండాలు తమ కార్యకర్తలపై దాడి చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా ఈ విషయం పై సీపీ విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో మరోసారి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయన కుటుంబానికి.. ప్రజలు బానిసల్లాగా మారాల్సి వస్తుందని అన్నారు బండి. ముఖ్యమంత్రి కుమారుడు, బిడ్డ, అల్లుళ్లు, చుట్టాలు జిల్లాలకు వస్తే.. మూడు రోజుల ముందే అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో వ్యవసాయ బావుల వద్ద మోటార్లకు మీటర్లు పెడతామని, తమకు లోన్ ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూ లేఖ రాసిందని చెప్పారు సంజయ్.
బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీపై ఇంతవరకు డీపీఆర్ ఇవ్వని మాట నిజం కాదా? అని ప్రశ్నించారు బండి. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కలన్నీ తప్పే అని ఆరోపించారు. నిరూపించేందుకు తాను రెడీ.. బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. దమ్ముంటే డేట్, టైం, వేదిక ఫిక్స్ చేసి తన సవాల్ ను స్వీకరించాలని అన్నారు. బీజేపీ కార్యకర్తలను వేధిస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు.