ఆర్టీసీ ఛార్జీల పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విరుచుకుపడ్డారు. గత మూడేళ్లలోనే 5 సార్లు ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తోదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే పెంచిన బస్ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ చేపట్టే ఉద్యమాల సెగను చవిచూడక తప్పదంటూ హెచ్చరించారు. నేడు నాటకీయ పరిణామాల మధ్య బండి సంజయ్ జూబ్లీ బస్టాండ్ కు చేరుకున్నారు. బస్ చార్జీల పెంపుపై బిజెపి జేబీఎస్ లో నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడంతో హైదరాబాద్ లోని బండి సంజయ్ ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. పోలీసుల కళ్లుగప్పి జేబీఎస్ కు చేరుకున్న సంజయ్.. ఆర్టీసీ ప్రయాణికుల అభిప్రాయాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెరిగిన బస్ ఛార్జీలతో తమకు చాలా ఇబ్బంది ఎదురవుతోందని…. ఛార్జీల భారాన్ని మోయలేకపోతున్నామని ప్రయాణికులు వాపోయారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఫైరయ్యారు.
తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు, ఆస్తి పన్ను, నల్లా బిల్లులు ఎడాపెడా పెంచింది. అటు వ్యాట్ పేరుతో పెట్రోలుపై లీటర్ కు 30 రూపాయలు దండుకుంటుండు.. ఇట్లా అన్నీ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరగ్గొడుతున్న కేసీఆర్ ఇప్పుడు మళ్లా ఆర్టీసీ ఛార్జీలను ఇష్టానుసారంగా పెంచి ప్రజల బతుకు ఆగం చేస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినంక ఆర్టీసీ ఛార్జీలను పెంచడం ఇది ఐదోసారి. నిన్న ఏకంగా 20 నుండి 30 శాతం దాకా ఛార్జీలు పెంచింది. మొత్తంగా ఇఫ్పటివరకు ప్రయాణీకులపై సగటున 60 శాతంపైగా ఆర్టీసీ ఛార్జీలను పెంచింది. ప్రయాణికులకు మినిమం టిక్కెట్ ధరను వంద శాతం పెంచింది. 2018లో హైదరాబాద్ నుండి కరీంనగర్ కు బస్సులో వెళ్లాలంటే 2018లో 200 రూపాయలుంటే… ఇప్పుడది 300 దాటిపోయిందంటూ సంజయ్ వివరించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోకానీ…. దేశ చరిత్రలో కానీ ఆర్టీసీ బస్సు ఛార్జీలను 3 ఏళ్లలో 5 సార్లు పెంచిన దాఖలాల్లేవని సంజయ్ గుస్సా అయ్యారు. ఆర్టీసీ గరీబోళ్ల బస్సు. సామాన్యుడి రవాణాకు ఉన్న ఏకైక మార్గం ఆర్టీసీ బస్సు. గరీబోళ్లు ఆ బస్సు కూడా ఎక్కకుండా చేస్తున్న సీఎం బహుశా దేశంలో కేసీఆర్ మాత్రమే ఉన్నాడని వాపోయారు.
పెట్రోలు, డీజిల్ రేట్లు పెరిగితే కేంద్రం 6 నెలల కాలంలోనే లీటర్ పెట్రోలుపై దాదాపు 15 రూపాయలు, డీజిల్ పై 17 రూపాయలు తగ్గించిందని బండి గుర్తుచేశారు. కానీ కేసీఆర్ మాత్రం దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్, డీజీల్ పై ఒక్కో లీటర్ కు అత్యధికంగా వ్యాట్ (35.2 శాతం) పన్నును వసూలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. అసలే పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ పేరుతో దోచుకుంటూ ప్రజలను పీడిస్తూ, ఈ ఏడేళ్లలోనే 65 వేల కోట్ల రూపాయలకు పైగా దండుకుంటున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా పెట్రోలు, డీజిల్ రేట్ల సాకు చూపి సామాన్యుడి గరీబ్ రథమైన ఆర్టీసీ బస్సు ఛార్జీలను కూడా ఎడాపెడా పెంచేసి జేబు నింపుకుంటున్నారని ఆరోపించారు. చివరకు ఆర్టీసీ విలువైన ఆస్తులను కూడా లీజు పేరుతో టీఆర్ఎస్ నేతలకు దారాధత్తం చేశారని బండి ఆరోపణలు గుప్పించారు. ఆర్మూరు పట్టణంలో ఆర్టీసీ విలువైన స్థలాన్ని అక్కడి ఎమ్మెల్యేకు, వరంగల్ టైర్ల పరిశ్రమ కోసమంటూ ఆర్టీసీ స్థలాలను టీఆర్ఎస్ లీడర్లకు అప్పగించారని చురకలు అంటించారు.
ఆర్టీసీ కార్మికులకు నెలనెలా సక్రమంగా జీతాలు చెల్లించడం లేదు.. ఇప్పటికీ 2 పీఆర్సీలు, 5 డీఎల్ లు పెండింగ్ లో ఉంచి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఆర్టీసీ అనివార్యంగా ప్రైవేటుపరమయ్యేలా చేస్తున్నారంటూ సంజయ్ ఫైరయ్యారు. ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తానని చెప్పిన కేసీఆర్.. సీఎం కాకముందు 10 వేల ఆర్టీసీ బస్సులుంటే 4 వేలకు తగ్గించారని విరుచుకుపడ్డారు. మరోవైపు కేసీఆర్ కు చట్టాలంటే లెక్కలేదు… పేదలు, మధ్యతరగతి ప్రజలంటే విలువ లేదని, రాజ్యాంగమంటే లెక్కేలేదని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. కేసీఆర్ పాలనలో కార్మికులను, కర్షకులను, మహిళలను అరిగోస పెడుతూ, హత్యలు, అత్యాచారాలతో రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నాడన్న బండి సంజయ్..మూర్ఖపు పాలనపై ఉద్యమిస్తామని హెచ్చరించారు.