– అడెల్లి పోచమ్మ ఆలయంలో బండి పూజలు
– లాంఛనంగా ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభం
– బండి నినాదాలతో మార్మోగిన నిర్మల్
– హైకోర్టు ఆదేశాలను పాటిస్తామన్న సంజయ్
– జనంలోకి రావాలని కేసీఆర్ కు సవాల్
వచ్చే ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా పావులు కదుపుతోంది బీజేపీ. ఓవైపు చేరికలను ప్రోత్సహిస్తూ.. ఇంకోవైపు పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగిస్తున్నారు. నాలుగు విడతలు పూర్తయిన ఈ యాత్ర ఐదో విడతకు అన్ని ఏర్పాట్లు చేసుకోగా పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో బీజేపీ హైకోర్టును ఆశ్రయించగా.. షరతులతో కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
పోలీసులు ఎక్కడైతే వదిలిపెట్టారో అక్కడి నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో బండి సంజయ్ నిర్మల్ వెళ్లారు. అడెల్లి పోచమ్మ ఆలయంలో పూజలు చేసి.. ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. అధ్యక్షుడి అడుగులో అడుగేస్తూ వేలాదిగా తరలివచ్చిన బీజేపీ శ్రేణులు ముందకు కదిలారు. సెల్ఫీల కోసం ఎగబడ్డారు. బండి నాయకత్వం వర్ధిల్లాలి.. బీజేపీ జిందాబాద్ నినాదాలతో నిర్మల్ మార్మోగింది.
భైంసా సిటీకి 3 కిలోమీటర్ల దూరంలో సభ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది హైకోర్టు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఆ ఏర్పాట్లలో ఉన్నారు. మంగళవారం యాత్ర కోసం ఏర్పాట్లు చేశారు. బండి సంజయ్ పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా పలుమార్లు ముందుగా అనుమతి ఇచ్చిన పోలీసులు.. లాస్ట్ మినిట్ లో నిరాకరించారు. దీంతో బీజేపీ హైకోర్టును ఆశ్రయించడం.. తర్వాత గ్రీన్ సిగ్నల్ రావడం జరిగింది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయింది.
పాదయాత్రకు వస్తున్న ప్రజాధరణను చూసి కేసీఆర్ ఓర్వలేకపోతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ఏదో ఒక విధంగా అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత కుట్రపూరితంగా అడ్డుకున్నారని మండిపడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం పాదయాత్రను ప్రారంభించానని చెప్పారు. భైంసాను సెన్సిటివ్ ప్రాంతంగా మార్చింది ఎవరు? అని ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారమే యాత్రను కొనసాగిస్తామన్నారు. దమ్ముంటే సీఎం ప్రజల్లో తిరగాలని సవాల్ విసిరారు. ఫాంహౌజ్ లో కాదు ప్రజల దగ్గరకు వస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు బండి సంజయ్.