తెలంగాణ రాష్ట్రం నాస్తికుల రాజ్యంగా మారుతోందనే బాధ కలుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వేములవాడలో భక్తుల రద్దీ, సౌకర్యాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు బండి సంజయ్.
సీఎం కనీసం సమీక్ష కూడా చేయలేని దౌర్భాగ్యంలో ఉన్నారా..? అని ప్రశ్నించారు. మీరు గతంలో ఇచ్చిన హామీలేమయ్యాయని నిలదీశారు. వేములవాడకు రూ.200 కోట్లు విడుదల చేస్తానన్న మీ మాటలన్నీ నీటిమూటలేనా.. అని ప్రశ్నించారు. గతంలో ప్రతి దానికి ఆంధ్రోళ్ల పేరు చెప్పి తప్పించుకున్నవ్ కదా..! ఇప్పుడు భక్తులు పడుతున్న ఇబ్బందులకు ఏం సమాధానం చెప్తారు సారు అని మండిపడ్డారు.
వేములవాడ ఆలయ నిధులను వాడుకొని దేవుడికే శఠగోపం పెడుతున్న వ్యక్తి కేసీఆర్ అని ఆరోపించారు. రాజన్న పవర్ ఫుల్ దేవుడు.. ఇచ్చిన హామీలను నెరవేర్చని వాళ్ల సంగతి ఆయనే చూసుకుంటాడని శపించారు బండి. వేములవాడ రాజన్న ధర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతుంటే చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు.
భక్తులు కోరిన కోర్కెలు తీరాలని వేములవాడ రాజన్నను మనస్పూర్తిగా వేడుకుంటున్నానని అన్నారు. దక్షిణ కాశీగా పేరున్న వేములవాడలో భక్తులు ఇన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మత్తు నిద్రలో మూలుగుతోందని అన్నారు. మేడారం జాతర సమయం దగ్గరకు వస్తున్నా.. ఎందుకు పట్టించుకోవడం లేదని అడిగారు. వేములవాడలో రోజుకు లక్ష మందికి పైగా భక్తులు దర్శనం చేసుకుంటున్నారని అన్నారు.