– ప్రజాస్వామ్య గొంతును నులిమేసే కుట్ర!
– సీఎం ధర్నా చేస్తే ఒప్పు..
– బీజేపీ దీక్ష చేస్తే తప్పా?
– ఇదెక్కడి న్యాయం..?
– “ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష” చేసి తీరుతాం..
– ప్రజాస్వామ్యవాదులు మౌనం వీడాలి..
– బండి సంజయ్ పిలుపు..!
ఎమ్మెల్యేల సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ గురువారం ధర్నాచౌక్ దగ్గర ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు ప్లాన్ చేసింది బీజేపీ. అయితే.. దీనికి అనుమతి నిరాకరించారు పోలీసులు. దీంతో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్.. ఇది అత్యంత హేయమైన చర్య అని అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు, ఆందోళనలు చేసే వేదిక ధర్నా చౌక్ అని… ట్రాఫిక్ జాం, ప్రజలకు ఇబ్బంది పేరుతో బీజేపీ దీక్షకు అనుమతి ఇవ్వకపోవడం విస్మయానికి గురి చేసిందని చెప్పారు.
“ధర్నా చౌక్ కు అనుమతి వచ్చాక టీఆర్ఎస్, కాంగ్రెస్ సహా అనేక రాజకీయ పార్టీలు, సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అప్పుడు లేని ఇబ్బంది బీజేపీ దీక్ష చేపడతానంటేనే వస్తోందా? ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యాన్ని గొంతు నులిపేసే కుట్ర. బీజేపీని అణిచివేసే చర్యగా భావిస్తున్నాం” అని విమర్శించారు సంజయ్.
బీజేపీ పేరు వింటేనే కేసీఆర్ వెన్నులో వణుకు పుడుతోందని చురకలంటించారు బండి. ప్రజా సమస్యలపై నిరంతరం గళమెత్తుతున్న బీజేపీని అణిచివేయాలని అడుగడుగునా సీఎం కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి తప్పు చేయకపోయినప్పటికీ బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా బడ్జెట్ సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం అందులో భాగమేనన్నారు. సభలోకి బీజేపీ ఎమ్మెల్యేలను అనుమతించే విషయాన్ని పరిశీలించి స్పీకర్ చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకుని ప్రజాస్వామ్యస్ఫూర్తిని కాపాడాలని హైకోర్టు చేసిన సూచనను కూడా కాలరాయడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమని చెప్పారు.
బీజేపీ చేపట్టిన “ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష”కు అనుమతిని నిరాకరించడం కుట్ర పూరితమన్నారు బండి. ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, ప్రజా సంఘాల నేతలు.. టీఆర్ఎస్ ప్రభుత్వ అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక, పక్షపాత చర్యలపై స్పందించాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఇంకెన్ని నిర్బంధాలు విధించినా ప్రజా సమస్యలపై, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం బీజేపీ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.
కేసీఆర్ అవినీతి-కుటుంబ-నియంత పాలనను అంతం చేసేదాకా బీజేపీ ఉద్యమిస్తూనే ఉంటుందన్నారు సంజయ్. గురువారం(17.3.2022) తలపెట్టిన “ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష”ను యధాతథంగా కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేందుకు కేసీఆర్ ఫ్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టి తీరుతామని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ టీఆర్ఎస్ ప్రభుత్వం చెంప చెళ్లుమన్పించేలా బీజేపీ చేపట్టే దీక్షకు సంఘీభావం తెలపాలని కోరారు బండి సంజయ్.