ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. ‘‘పాలమూరు ప్రజల పట్ల వివక్ష చూపుతున్నారు. టీఆర్ఎస్ సర్కారు వల్ల పాలమూరు ప్రాజెక్టులు పూర్తికాలేదు‘‘ అని లేఖలో పేర్కొన్నారు.
పాలమూరును పచ్చగా చేస్తానన్న వాగ్ధానాలేవీ అమలు కాలేదన్నారు. ఇక్కడి నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సాగునీటి కష్టాల్ని తీర్చాలనే శ్రద్ధ ప్రభుత్వంలో కనిపించడం లేదని పేర్కొన్నారు. పాలమూరుకు రండి.. సాగునీటి ప్రాజెక్టులపై చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.. మీరు సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు.
పాలమూరులో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ లేఖలో రాశారు. జిల్లా ప్రజలు సాగునీరు అందక వలసల విలపిస్తున్నారని.. పట్టిపట్టనట్టు ప్రభుత్వం వ్యవహరించడం సరికాదన్నారు. నీటి సమస్యల నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటా దక్కలేదని గుర్తుచేశారు. గడిచిన ఏనిమిదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఏ సాగునీటి ప్రాజెక్టు పూర్తి కాలేక పోయిందని’’ సంజయ్ లేఖలో పేర్కొన్నారు బండి సంజయ్.