ప్రజా సమస్యలపై నిలదీస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ కు తరచూ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో ఉన్న కౌలు రైతుల దుస్థితిని వివరిస్తూ కేసీఆర్ ను నిలదీశారు. రాష్ట్రంలో సుమారు 14 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని.. వారిలో సొంత భూమి కొద్దిమందికే ఉందన్నారు. ఎక్కువమంది భూమిని కౌలుకి తీసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారని చెప్పారు.
ప్రభుత్వం నుండి కౌలు రైతులకు ఎటువంటి గుర్తింపు లేదన్నారు బండి. దీంతో సాధారణ రైతాంగానికి వర్తించే ఏ సంక్షేమ పథకం అమలు కావడం లేదని లేఖలో పేర్కొన్నారు. భూమిపై సేద్యం చేసే కౌలు రైతులకు రైతు బంధు, రైతు బీమా, యంత్ర లక్ష్మి వంటి ప్రభుత్వ పథకాలు అందడం లేదని… సబ్సిడీ విత్తనాలు, ఎరువులు పొందే సౌకర్యం లేదన్నారు. పంట రుణాలు అందడం లేదని… వ్యవసాయమే చేయని యజమానులు రైతుబంధుతో పాటు కౌలు కూడా తీసుకుంటూ రైతు బీమా సహ ఇతర సంక్షేమ పథకాలు పొందుతున్నారని గుర్తు చేశారు. కాయకష్టం చేసే కౌలు రైతులకు మాత్రం ఆయా పథకాలను వర్తింపచేయకపోవడం కరెక్ట్ కాదన్నారు.
భూ యాజమానుల హక్కులకు ఎటువంటి భంగం వాటిళ్లకుండా రాష్ట్రాలు కౌలు చట్టాలలో మార్పులు చేసుకోవాలని 11వ పంచవర్ష ప్రణాళిక పేర్కొందని లేఖలో ప్రస్తావించారు బండి. కౌలు చట్ట సవరణ అంటే భూయజమాని, కౌలుదార్లకు భరోసా కల్పించే విధంగా సవరణలు ఉండాలని ఆ నివేదికలో స్పష్టం చేశారన్నారు. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం కౌలుదార్లకు ఎటువంటి హక్కులు కల్పించకపోగా వారిని కనీసం రైతులుగా గుర్తించడానికి కూడా నిరాకరించడం గర్హనీయమని చెప్పారు.
పావలా వడ్డీకి కౌలుదార్లకు రుణాలు ఇవ్వొచ్చని నాబార్డు సూచించిందని వివరించారు సంజయ్. ఆంధ్రప్రదేశ్ లో సాధారణ రైతాంగానికి వర్తింపజేసే పథకాలను కౌలుదార్లకు అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించిందని.. కానీ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వారిపై వివక్ష చూపడం క్షమించరానిదని విమర్శించారు. భూమిని సాగు చేసి పంట పండించే వాడే నిజమైన రైతని చెప్పిన బండి… అలాంటి వారికి బోనస్ సహా ఎరువులు, విత్తనాలతోపాటు వ్యవసాయ సబ్సిడీలన్నీ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. అవసరమైతే తగు చట్టాలు తీసుకొచ్చినా.. ఉన్న వాటిలో సవరణలు చేసైనా కౌలు రైతులను ఆదుకునేలా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల సమస్యలపై చర్చించేందుకు రైతుసంఘాలు, మేధావులు, అన్ని రాజకీయపార్టీలతో వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని లేఖలో పేర్కొన్నారు బండి సంజయ్.