కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఫీల్డ్ నుంచి కాంగ్రెస్ వెళ్లిపోయిందని ఆయన అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఆయన తెలిపారు. దీనిపై ఢిల్లీలో ఆ పార్టీలు ఒప్పందం కుదుర్చుకున్నాయని అన్నారు.
ఎవరైనా తాము ఎన్నికల్లో గెలుస్తామని చెప్పుకుంటారని అన్నారు. కానీ కాంగ్రెస్ నేతలు ఓడిపోతామంటూ చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసినప్పటికీ ఆ పార్టీ నేతలు ఇంకా యాత్రలు ఎందుకు చేస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు.
ఎన్నికలకు ముందు వేరు వేరుగా పోటీ చేసి ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే అది ప్రజలను మోసం చేయడమే అవుతుందని ఆయన మండిపడ్డారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 119 స్థానాల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆయన స్పష్టం చేశారు.
119 నియోజకవర్గాల్లో గెలిచే అభ్యర్థులు తమకు ఉన్నారని ఆయన చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో తాము ఎన్నికల్లో సింగిల్‌గానే పోటీ చేసి గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ నిజాయితీపరుడు కాబట్టే ప్రజలు తమకు ఓటేస్తారని ఆయన తెలిపారు.
ఇంకా సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్ ఆయన మనిషి అనుకుంటున్నారని ఆయన అన్నారు. బీజేపీకి భయపడే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటి అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల వరకు తన్నుకుని ఆ తర్వాత ఆ పార్టీలు కలిసిపోతాయని అన్నారు.
వాళ్లు దండుపాళ్యం బ్యాచ్ అని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హోల్ సేల్‌గా కాంగ్రెస్ పోయి బీఆర్ఎస్ లో చేరిందన్నారు. కాంగ్రెస్ నేతలకు ఓటేసి గెలిపించినా వాళ్లు తిరిగి బీఆర్ఎస్‌లోకే వెళ్లి చేరుతారని ఆయన ఆరోపించారు.
రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ పార్టీకి 60 సీట్లు కూడా రావని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌తో కలవడం తప్పా బీఆర్ఎస్ కు వేరే మార్గం లేదన్నారు. అందుకే రాబోయే ఎన్నికల ముందు ఎలాంటి పొత్తులు లేకపోయినా ఫలితాల తర్వాత మాత్రం కచ్చితంగా పొత్తులతో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు.