బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ ఓ యువకుడ్ని కొడుతున్న వీడియో బయటకొచ్చింది. దీంతో బండి వ్యతిరేక వర్గాలన్నీ ఆయన్ను ఓ ఆటాడుకుంటున్నాయి. ఇదేం రౌడీయిజం అంటూ ప్రధాని మోడీని సైతం ఈ ఇష్యూలోకి లాగుతున్నాయి. హైదరాబాద్ లోని మహీంద్రా విశ్వవిద్యాలయంలో ఈ ఘటన జరిగింది.
ఈ ఇష్యూపై దుమారం చెలరేగగా.. బాధితుడు ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశాడు. తప్పంతా తనదేనని ఒప్పుకున్నాడు. బండి కుమారుడు కొట్టిన మాట వాస్తవమేనని.. కాకపోతే తాను ఓ అమ్మాయితో తప్పుగా బిహేవ్ చేయడం వల్లే అలా చేశాడని చెప్పాడు. అంతేకాదు.. ప్రస్తుతం తాము మంచి స్నేహితులుగా ఉంటున్నామని.. ఈ వీడియోతో అనవసరం రాద్ధాంతం చేయొద్దని కోరాడు.
బాధితుడి వీడియోలో చెప్పింది ఇదే!
‘‘నా పేరు శ్రీరామ్. నేను భగీరథ్ ఫ్రెండ్ సిస్టర్ కి తెల్లవారుజాము 4 గంటలకు ఫోన్ చేశా. మెసేజ్ కూడా పెట్టా. నన్ను లవ్ చేయమని మిస్ బిహేవ్ చేశా. ఈ విషయం భగీరథ్ కి తెలిసి నాతో మాట్లాడాడు. నేను ఆ సమయంలో ఎక్కువతక్కువగా మాట్లాడా. దాంతో భగీరథ్ నన్ను కొట్టాడు. తర్వాత జరిగింది నేను మర్చిపోయా. మేము కలిసే ఉంటున్నాం. మేము ఫ్రెండ్సే. బ్యాచ్ మెట్సే. అది ఎప్పుడో జరిగింది. మేం మర్చిపోయాం. ఆ వీడియో ఎందుకూ పనికిరాదు. అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పుడు ఆ వీడియోతో బ్లాక్ మెయిల్ చేయొచ్చు. మా మధ్య విభేదాలు పెంచడానికి చూడొచ్చు. మేం కలిసే ఉన్నాం’’
మరోవైపు బండి కుమారుడిపై కేసు నమోదు చేశారు దుండిగల్ పోలీసులు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.