బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ కు సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి. ముందు శ్రీరామ్ అనే యువకుడ్ని కొడుతున్న వీడియో బయటకు రాగా.. తాజాగా మరొకటి వైరల్ అవుతోంది. రూమ్ లో ఓ యువకుడ్ని కొడుతున్నట్టుగా ఉంది.
ఈ వీడియోలు కలకలం రేగడంతో మహీంద్రా యూనివర్సిటీ యాజమాన్యం.. భగీరథ్ పై చర్యలు తీసుకుంది. అతడ్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటు భగీరథ్ పై కేసు నమోదైంది. విద్యార్థులపై దాడికి పాల్పడ్డాడని అతడిపై ఐపీసీ 341, 323, 504, 506, 34 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే.. మొదటి వీడియోకు సంబంధించిన బాధితుడు తప్పంతా తనదేనని.. అమ్మాయిని ఏడిపించడం వల్లే భగీరథ్ తనను కొట్టాడని చెప్పాడు. ఇప్పుడు తామిద్దరం బాగానే ఉంటున్నామని ఓ వీడియో బైట్ రిలీజ్ చేశాడు. ఇక రెండో వీడియోకు సంబంధించిన బాధితుడు స్పందించలేదు.
మరోవైపు ఈ ఘటనపై బండి సంజయ్ స్పందించారు. రాజకీయం చేస్తే తనతో చెయ్యాలన్నారు. అది చేతగాక తన కుమారుడ్ని కేసులో ఇరికించారని అసహనం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ మనవడిపై వేరేవాళ్లు కామెంట్స్ చేస్తే తాను వ్యతిరేకించానని గుర్తుచేశారు. ఆ జ్ఞానం తనకు ఉందన్నారు. తన కుమారుడిపై క్రిమినల్ కేసు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు.