తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ లేఖ రాశారు. రాష్ట్రంలో తక్షణమే పీఆర్సీని ఏర్పాటు చేయాలని లేఖలో ఆయన డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జూలై 1 నుంచి వేతనాలు చెల్లించాలని ఆయన కోరారు.
రాష్ట్ర సాధన కోసం గతంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు 42 రోజుల పాటు సకల జనుల సమ్మె చేస్తే అప్పటి ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. బీజేపీ మద్దతుతోనే పార్లమెంట్ లో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించిందన్నారు. కానీ, స్వరాష్ట్రంలో ఉద్యోగుల, ఉపాధ్యాయుల హక్కులను కాపాడాల్సిన మీరు సీఎం అయ్యాక వారిని ఇంకా అడుగడుగునా మోసం చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు తీసుకోవడం ఉద్యోగుల హక్కు అని ఆయన పేర్కొన్నారు. కానీ వారికి సక్రమంగా జీతాలు ఇవ్వకుండా ఇప్పుడు వారి హక్కులను హరిస్తున్నారని మండిపడ్డారు. 317 జీవో అమలు పేరుతో ఉద్యోగుల కుటుంబాలను చిన్నాభిన్నం చేశారని, ఉద్యోగుల కుటుంబాలను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యోగులకు చెల్లించాల్సిన 4 డీఏలను కూడా ఇవ్వకుండా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. పీఆర్సీ అమలు విషయంలోనూ మోసం చేస్తున్నారంటూ ఆయన ఫైర్ అయ్యారు.తొలి పీఆర్సీ నివేదికను 2018 జులై 1 నుంచి అమలు చేయాల్సి ఉందన్నారు. కానీ 21 నెలలు అమలు చేయకుండా ఉద్యోగ, ఉపాధ్యాయులను ఇబ్బందిపెట్టారని ఆయన వెల్లడించారు.
ఈ ఏడాది జులై 1 నుంచి కొత్త పీఆర్సీ అమల్లోకి రావాల్సి వుండగా ఇప్పటి వరకు పీఆర్సీ కమిషన్ నియమించకపోవడం అన్యాయమన్నారు. పీఆర్సీ నివేదిక లేకుండా పీఆర్సీని ఎట్లా అమలు చేస్తారు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఏదో రకంగా కాలయాపన చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ ఎగ్గొట్టాలనే ధోరణి కనిపిస్తోందని ఆరోపించారు.