– 317 జీవోను పున:సమీక్షించాల్సిందే..
– లేనిపక్షంలో ఉద్యోగుల పక్షాన ఉద్యమిస్తాం
– త్వరలోనే ఉద్యమ కార్యాచరణ
– ధాన్యం కొనుగోలు విషయంలో సీఎంవన్నీ పిచ్చి మాటలే
– వానాకాలం పంటంతా కేంద్రం కొంటుంది
– ఆసిఫాబాద్ ప్రశిక్షణా కార్యక్రమంలో బండి సంజయ్
ఉద్యోగుల బదిలీల విషయంలో కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మండిపడ్డారు. సీఎం తీరువల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులు అల్లాడిపోతుంటే ఉద్యోగ సంఘాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. తక్షణమే 317 జీవోపై పున:సమీక్షించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన బీజేపీ ఉద్యమిస్తుందని ప్రకటించారు. త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. బీజేపీ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రశిక్షణా సమావేశంలో పాల్గొనేందుకు సిర్పూర్ కాగజ్ నగర్ కు వెళ్లిన బండి.. మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల రీ అలాట్ మెంట్, ధాన్యం కొనుగోలు వంటి అంశాలపై మాట్లాడారు.
‘‘317 జీవో పేరుతో కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుతో ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబాలన్నీ ఛిన్నాభిన్నం అయ్యే పరిస్థితి వచ్చింది. ఉద్యోగులంతా స్థానికేతరులుగా మారి చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురయ్యే దుస్థితి ఏర్పడింది. ఉద్యోగుల్లో ఎవరిని కదిలించినా అరిగోస పడుతున్నారు. కానీ, సీఎం కనీసం వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. పైగా సీనియర్, జూనియర్ పేరుతో కొట్లాటలు పెడుతున్నారు. ఉరిశిక్ష వేసే ముందైనా చివరి కోరిక ఏంటని అడుగుతారు. కానీ, ఉద్యోగులకు మాత్రం కనీసం అవకాశం ఇవ్వకుండా, సమయం ఇవ్వకుండా రీఅలాట్ మెంట్ చేస్తూ వాళ్ల కుటుంబాల్లో చిచ్చు పెట్టారు. ఉద్యోగుల హక్కుల కోసం పోరాడాల్సిన ఉద్యోగ సంఘాలు ఎవరికి కొమ్ము కాస్తున్నాయి? నేడు ఉద్యోగులు, ఉపాధ్యాయుల పడుతున్న ఇబ్బందులకు ఉద్యోగ సంఘాలే బాధ్యత వహించాలి. వాళ్ల చేతగానితనం వల్లే ఈ కష్టాలు వచ్చాయి’’ అంటూ విమర్శలు చేశారు బండి.
ఇప్పటికైనా సీఎం సోయిలోకి రావాలని.. 317 జీవోపై పున:సమీక్షించాలని డిమాండ్ చేశారు సంజయ్. ఉద్యోగ, ఉపాధ్యాయుల బాధలు విన్న తరువాతే రీ అలాట్ మెంట్ ప్రక్రియ చేపట్టాలన్నారు. లేనిపక్షంలో బీజేపీ పక్షాన ఉద్యమం తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. సీఎం రోజుకో కొత్త సమస్యను తెరపైకి తీసుకొస్తున్నారని.. లాకర్లలో పైసలు పెట్టుకున్నట్లుగా సమస్యలను పెట్టుకుని తనకు అవసరమైనప్పుడల్లా బయటకు తీస్తూ ప్రజలను అయోమయంలోకి నెట్టేస్తున్నారని విమర్శించారు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్న ఆయన.. ప్రజా సమస్యలు, నిరుద్యోగ, ఉద్యోగ సమస్యలపై పోరాటాలు చేస్తుంటే ఒమిక్రాన్ గుర్తుకొచ్చిన సీఎంకు బార్లు, పబ్బులకు అనుమతులు ఇచ్చేటప్పుడు గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు. కొత్త ఏడాది కానుకగా తాగు-ఊగు పేరుతో బంపరాఫర్ ఇచ్చి కలెక్షన్ల మీద పడ్డారని.. ఆయనదంతా రాత్రి బార్-దర్బార్ నిర్ణయాలేనని చురకలంటించారు.
‘‘కేంద్రం వానా కాలం పంటకు సంబంధించి ప్రతి గింజా కొనేందుకు సిద్ధమని పదేపదే చెబుతోంది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం గత సెప్టెంబర్ లో రాసిన లేఖకు స్పందిస్తూ 6 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు లేఖ పంపింది. కానీ, టీఆర్ఎస్ కేంద్రం మెడలు వంచినట్లుగా చెప్పుకోవడం సిగ్గు చేటు. ఢిల్లీలో పార్లమెంట్ సెంట్రల్ హాల్ క్యాంటీన్ లో ఫోటోలు దిగి పార్లమెంట్ లో ధర్నా చేసినట్లు మీడియాకు ఫోజులిచ్చిన ఎంపీలు.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదం. మెడమీద కత్తిపెడితే బాయిల్డ్ రైస్ ఇయ్యబోనని కేంద్రానికి లేఖ రాసిచ్చినట్లు చెప్పిన సీఎం.. అదే కేంద్రం మెడలు వంచి అదనపు ధాన్యం కొనుగోలు చేయించినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటు. మెడమీద కత్తిపెట్టి 317 జీవో రద్దు చేయమంటే రాసిస్తవా? సిగ్గుండాలి. నేను బయటపెట్టేదాకా కేంద్రానికి రాసిచ్చిన అగ్రిమెంట్ ఇచ్చిన సంగతి చెప్పని సీఎం.. మెడమీద కత్తిపెడితే రాసిచ్చానని చెప్పారు. సీఎం మెడలు వంచే సమయం దగ్గర్లోనే ఉంది. కేసీఆర్ బాయిల్డ్ రైస్ తినడట.. కానీ కేంద్రం మాత్రం కొనాలట. కొని ఏం చేయాలి? నీ నోట్లో కుక్కమంటావా? మళ్లీ మళ్లీ చెబుతున్నాం. వానా కాలం పంటకు సంబంధించి రా రైస్ ఎంతైనా కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. అయినా కేంద్రం మెడలు వంచినట్లు పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు’’ అంటూ హెచ్చరించారు సంజయ్.
పంటల మార్పిడి కోసం తెలంగాణలో భూసార పరీక్షలు నిర్వహించాలని మూడేళ్ల కిందటే కేంద్రం నిధులిస్తే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయలేదని ఆరోపించారు బండి. కానీ, రైతులను వరి వేయొద్దంటూ అయోమయానికి గురి చేస్తోందని అన్నారు. పోనీ ఏ పంట వేయాలో చెప్పలేదు.. దానికి తగ్గట్లుగా విత్తనాలివ్వలేదని విమర్శించారు. కేసీఆర్ కు యాసంగి పంట ఎంత వస్తుందో చెప్పే దమ్ముందా అని సవాల్ చేశారు బండి. పోనీ..ఈ వానాకాలంలో ఎంత ధాన్యం పండించారో ఆయన దగ్గర లెక్కలున్నాయా? అని అడిగారు. ప్రతి గింజా కొంటామని చెప్పి మోసం చేసింది కేసీఆరేనన్న ఆయన… రైతులు వాస్తవాలు గ్రహించాలని కోరుతున్నట్లు చెప్పారు.