దాహాం తీర్చుకునేందుకు నీటి గుంత వద్దకు గర్భంతో ఉన్న ఓ ఏనుగు వచ్చింది. అదే సమయంలో ప్రసవం కాగా.. రెండు కవల ఏనుగు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే, అప్పుడే పుట్టిన కవల ఏనుగు పిల్లలు మునిగిపోతుండగా.. అటవీ శాఖ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి కాపాడారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.
బందీపూర్ అడవిలో అటవీ శాఖ అధికారులు ‘ఆపరేషన్ ట్విన్స్’ పేరుతో ఓ ఏనుగు కవల పిల్లలను కాపాడారు. ఏనుగు పిల్లలు నీటి మునిగిపోతున్నాయనే సమాచారం తెలుసుకున్న అధికారులు.. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇందుకోసం రెండు బృందాలుగా ఏర్పడ్డారు.
ఒక బృందం తల్లి ఏనుగు తమపై దాడి చేయకుండా.. ఏనుగు పిల్లల నుంచి దానిని దూరంగా తరమడం కోసం ఏర్పడ్డారు. మరో బృందం ఏనుగు పిల్లలను నీటి గుంత నుంచి బయటకు తీసే పనిలో నిమగ్నమయ్యారు. ఆ గుంతలో నుంచి ఏనుగు పిల్లలను పైకి ఎక్కేలా చేశారు.
ఆ తర్వాత తల్లి ఏనుగు వద్దకు పిల్ల ఏనుగులను సురక్షితంగా చేర్చారు అధికారులు. క్షేమంగా బయటపడ్డ పిల్లలతో అడవిలోకి వెళ్లిపోయింది ఆ ఏనుగు. అయితే, ఏనుగు పిల్లల మెడ వరకు నీరు ఉండటంతో మునిగిపోతాయనే భయం వేసిందని అధికారులు తెలిపారు. వాటిని నీటి గుంత నుంచి బయటకు తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని.. ఈ ఆపరేషన్ అధికారులకు, సిబ్బందికి మంచి అనుభవంతో పాటు ఆనందాన్ని కలిగించిందని చెప్పారు.