టీబీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ రాష్ట్ర మహిళా కమిషన్ కు లేఖ రాశారు. ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తాను రేపు మహిళా కమిషన్ ఎదుట హాజరు కాలేనని ఆయన లేఖ లో పేర్కొన్నారు. వచ్చే ఆదివారం అంటే ఈ నెల 18న సెలవు కాబట్టి.. ఆ రోజు సమయమిస్తే.. తాను విచారణకు హాజరవ్వగలనని అన్నారు.
అయితే బండి సంజయ్ పై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. కవితపై చేసిన వ్యాఖ్యలకు నోటీసులు జారీ చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. తన ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.మరో వైపు బండి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భగ్గుమన్నారు. అటు ఢిల్లీలో, ఇటు తెలంగాణలో నిరసనలకు దిగారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ దగ్గర ఆందోళన చేపట్టారు.
కవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని నిరసిస్తూ.. బండి సంజయ్ దిష్టిబొమ్మను తగులబెట్టేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇటు రాష్ట్రంలో కూడా బండి దిష్టిబొమ్మలను దహనం చేశారు నేతలు. వెంటనే ఆయన సారీ చెప్పాలని డిమాండ్ చేశారు.బండి వ్యాఖ్యలపై పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. కేసుల నమోదుపై న్యాయ సలహా తీసుకుంటున్నారు ఖాకీలు.
అన్నీ ఒకే తరహా ఫిర్యాదులు కావడంతో ఒక పీఎస్ కు బదిలీ చేసే యోచనలో ఉన్నారు. ఏదైనా ఒక పీఎస్ కు బదిలీ చేసి దర్యాప్తు చేయాలనుకుంటున్నారు. ఇటు మహిళా కమిషన్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డీజీపీని కూడా ఆదేశించింది. అయితే ఈడీ విచారణకు కవిత వెళుతున్న నేపథ్యంలో..బండి సంజయ్ ఆమె పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు పాల్పడిన కవితను విచారించకపోతే.. ముద్దాడుతారా అని ఆయన అన్నారు. అదే దుమారానికి దారి తీసింది.