నిన్నటికినిన్న గిల్డ్ అభిప్రాయాన్ని తిప్పికొట్టారు నిర్మాత అశ్వనీదత్. ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న ట్రెండ్స్ ను ఏకిపడేశారు. ఇప్పుడీ సీన్ లోకి ఫైర్ బ్రాండ్ బండ్ల గణేశ్ ఎంటరయ్యారు. అశ్వనీదత్ వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవించిన బండ్ల.. గిల్డ్ ను తిట్టిపోశారు. వేస్ట్ మాటలు కట్టిపెట్టి, సినిమాలు తీయాలన్నారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే…
– ఏ హీరోని, ఏ డైరక్టర్ ను రెమ్యూనరేషన్ తగ్గించుకోమని అడిగే అర్హత లేదు. ఎందుకంటే, డిమాండ్ ఉంది కాబట్టే వాళ్లు అడుగుతున్నారు. కార్లు అన్నీ ఒక్కటే. కానీ ప్రతి కారుకు ఓ రేటు ఉంటుంది. మారుతి కారుకు, బెంజ్ కారుకు తేడా ఉన్నట్టే.. హీరోల్లో కూడా రేంజ్, మార్కెట్ బట్టి రేటు ఉంటుంది. మనం సినిమాను ఎంత తక్కువలో, ఎంత జాగ్రత్తగా తీయాలో ఆలోచించుకోవాలి తప్ప, రెమ్యూనరేషన్లు తగ్గించాలని కోరడం తప్పు.
– కాల్షీట్, షీట్ కు తేడా తెలియనోళ్లు కూడా సినిమాలు తీస్తున్నారు. షూట్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుందో, ఎప్పుడు ప్యాకప్ అవుతుందో కూడా తెలియనోళ్లు సినిమాలు తీస్తున్నారు. ఏరోజు ఏ లైట్లు వాడుతున్నారో, ఏ లొకేషన్ కు ఎంత ఖర్చవుతుందో తెలియనోళ్లు కూడా సినిమాలు తీస్తున్నారు. ఈ పద్ధతి మారాలి. తెలుసుకొని రండి, సినిమాలు తీయండి.
– ప్రొడ్యూసర్స్ గిల్డ్ వేస్ట్. ఓ ఛాంబర్, ఓ కౌన్సిల్ ఉంది. వాటికి కట్టుబడి ఉంటే చాలు. సినిమాలు తీయని వాళ్లు కూడా గిల్డ్ లో ఉన్నారు. సినిమా అనేది వడ్డీ వ్యాపారం కాదు. ఏదో ప్రాజెక్టు కట్టడం లాంటిది కాదు. సినిమా అనేది ఎమోషన్. ప్రేమించి సినిమా తీయాలి. ఫ్లాప్స్-హిట్స్ సహజం. మనం ఎంత ప్రేమించాం, ఎంత నిజాయితీగా ఉన్నామనేది ముఖ్యం. ఎన్ని సినిమాలు తీశారు అని అడగాలి తప్ప, ఎన్ని హిట్స్ తీశారు అని అడక్కూడదు.
– వడ్డీలు తగ్గించాలి, హీరోల పారితోషికాలు తగ్గించాలి లాంటివి ఆలోచించకూడదు. వర్కింగ్ డేస్ తగ్గించాలి, క్వాలిటీ మేకింగ్ పెంచాలి. తీసిన ప్రతి ఫ్రేమ్ సినిమాలో ఉండాలి. ఎడిటింగ్ పేపర్ మీద జరగాలి. అప్పుడు ఖర్చు తగ్గుతుంది, డబ్బులు వస్తాయి. ఇలా చేయకుండా హీరోలు డబ్బులు తగ్గించుకోవాలని అడగడం టైమ్ వేస్ట్ వ్యవహారం.
– సినిమాలు తీయడం చేతకాని నిర్మాతలు మీటింగులు పెట్టి మాట్లాడుతున్నారు. అసలు గిల్డ్ ఎందుకు? సురేష్ బాబు, అశ్వనీదత్, కృష్ణ కంటే వీళ్లు గొప్పోళ్లా? అంతెందుకు, ఇంత కావాలని హీరోలు ఎప్పుడైనా ఆడిగారా? మనమే కదా హీరోలకు రేట్లు పెంచాం. వాళ్లకు మార్కెట్ ఉంది కాబట్టి పెంచుకుంటూ పోయాం. ఇప్పుడు తగ్గించమని అడగడంలో అర్థంలేదు.
ఇలా ఓ వర్గం ప్రొడ్యూసర్లపై విరుచుకుపడ్డాడు బండ్ల గణేశ్.