నందమూరి తారకరత్న మరణంతో నందమూరి కుటుంబం, టీడీపీ శ్రేణులు, టాలీవుడ్ తీవ్ర విషాదంలో ఉంది. తారకరత్నకు నివాళులు అర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. అయితే తారకరత్న భార్య సతీమణి అలేఖ్యా రెడ్డి వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబానికి దగ్గరి బంధుత్వం ఉన్న సంగతి తెలిసిందే. దీంతో విజయసాయిరెడ్డి దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు.
ఈ క్రమంలో తారకరత్నకు నివాళులు అర్పించేందుకు చంద్రబాబు కూడా కుటంబంతో కలిసి అక్కడికి వచ్చారు. విజయసాయిరెడ్డి, చంద్రబాబులు పక్క, పక్కన కూర్చుని కొద్దిసేపు మాట్లాడుకున్నారు. విజయసాయిరెడ్డి, చంద్రబాబు ఫోటోను ట్వీట్ చేసి నిర్మాత బండ్ల గణేష్ చేసిన ట్వీట్‌పై దుమారం రేగుతోంది. ‘నా ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఈ విధంగా కూర్చొని మాట్లాడను, అవసరం వస్తే అక్కడ నుంచి వెళ్ళిపోతా అది నా నైజం. అత్యంత బాధాకరమైన విచిత్రం.. జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి…..!!!’అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.
బండ్ల గణేష్ ట్వీట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. రాజకీయాలు వేరు, బంధుత్వం వేరు కదా అంటూ కామెంట్ చేస్తున్నారు. అక్కడ సందర్భం వేరు, సమయం వేరు.. ఇంటికొచ్చిన శత్రువు నైనా మంచినీళ్ళు ఇచ్చి పలకరించే సంప్రదాయం మనది అంటూ ఒకరు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ జనాలకి అర్థం చేసుకునే శక్తి ఉంది అన్నారు. అర్థం లేకుండా మాట్లాడకు.. తారకరత్న విజయసాయిరెడ్డి అల్లుడు, నందమూరి వారసుడు. కష్ట కాలంలో ఒకే సమయంలో కలవాల్సి వచ్చినప్పుడు మాట్లాడుకుంటారు ‘నువ్వు నీ పిచ్చి ట్వీట్స్’ అంటూ మండిపడ్డారు. బండ్లన్నా.. రాజకీయాల్లో సైద్ధాంతికంగా విభేదాలు ఉండవచ్చు, వ్యక్తిగతంగా కాదు,పాలిటిక్స్ లో శాశ్వత శత్రువులు,శాశ్వత మిత్రులు ఉండరన్నారు.
నందమూరి తారకరత్నకు చంద్రబాబు ఆదివారం నివాళులు అర్పించారు. అనంతరం ఆ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత కూర్చున్నారు.. ఎంపీ విజయసాయిరెడ్డి వెళ్లి బాబు పక్కన కూర్చుని కొద్దిసేపు మాట్లాడారు. అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్‌తో కూడా విజయసాయిరెడ్డి మాట్లాడిన సంగతి తెలిసిందే.
తారకరత్న రాజకీయాల్లో ప్రవేశించాలని అనుకుంటున్న సమయంలో అనూహ్య రీతిలో ప్రాణాలు వదలడం బాధాకరమన్నారు ఎంపీ విజయసాయి రెడ్డి. తారకరత్న కుటుంబం.. తమ ఫ్యామిలీలో ఒక భాగమని బాలకృష్ణ చెప్పారని.. అలేఖ్యా రెడ్డిని, ఆమె పిల్లలను బాగోగులను తాము చూసుకుంటామని బాలయ్య హామీ ఇచ్చారన్నారు. బాలకృష్ణకు తారకరత్న ఫ్యామిలీ రుణపడి ఉంటుందన్నారు.
తారకరత్న అనారోగ్యానికి గురైన సమయం నుంచి బాలయ్యతో పాటూ నందమూరి కుటుంబం అండగా ఉందన్నారు ఎంపీ విజయసాయి. బాలయ్య ముహూర్తం పెట్టినట్టుగానే మధ్యాహ్నం 3 గంటల తర్వాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని తెలియజేశారు. తారకరత్నను కాపాడుకోడానికి బాలయ్య ఎంతగానో తపించారు.
బెంగళూరులో డాక్టర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ.. అవసరమైన సమయంలో విదేశాల నుంచి సైతం వైద్యులను రప్పించారు. అలాగే తారకరత్న కోసం చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలోని బత్తలాపురంలో మృత్యుంజయ స్వామి ఆలయంలో తారకరత్న క్షేమం కోసం అఖండ జ్యోతిని వెలిగించిన సంగతి తెలిసిందే.