బండ్ల గణేష్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నేరుగా ఎవరి పేరును ఆయన ప్రస్తావించనప్పటికీ.. ఆయన చేసిన 2 కీలక వ్యాఖ్యలు.. ఇద్దరు దర్శకుల గురించి అనే విషయం నెటిజన్లకు బాగా అర్థమైంది. ఇంతకీ గణేష్ చేసిన వ్యాఖ్యలేంటి..? ఆ ఇద్దరు దర్శకులు ఎవరు?
బండ్ల కామెంట్-1
“నేను నాగార్జునసాగర్ డ్యామ్ లాంటోడ్ని. అది ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. చాలామంది డ్యామ్ కింద నీళ్లు లాంటోళ్లు. నీరు అలా వెళ్లిపోతూనే ఉంటుంది. కానీ డామ్ మాత్రం చెక్కుచెదరదు. అక్కడే ఉంటుంది.” బండ్ల గణేశ్ చేసిన తాజా కామెంట్ ఇది. ఓ దర్శకుడి వల్ల బండ్ల గణేష్ కు, పవన్ కల్యాణ్ కు మధ్య గ్యాప్ వచ్చిందా అనే ప్రశ్నకు సమాధానంగా బండ్ల ఇలా స్పందించారు. ఆ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అయి ఉంటాడంటూ సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది.
బండ్ల కామెంట్-2
“అన్నం పెట్టే తల్లి లాంటి నిర్మాతను హేళన చేయకూడదు. అలా హేళన చేసిన వాళ్లకు ఇండస్ట్రీలో ఉండే అర్హత లేదు. నిర్మాతే కింగ్. గతంలో ఓ దర్శకుడు, చాలా రకాలుగా ప్రయత్నించాడు. పేర్లు అనవసరం. ఆ దర్శకుడు ఇప్పుడు ఏమయ్యాడు? ఎక్కడున్నాడు? అందరికీ తెలిసిందే.”
బండ్ల గణేశ్ ఇచ్చిన రెండో స్టేట్ మెంట్ హరీశ్ శంకర్ ను ఉద్దేశించి ఉండొచ్చని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. మొత్తమ్మీద బండ్ల గణేశ్ వ్యాఖ్యలు మరోసారి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.