నిర్మాత బండ్ల గణేష్ కు, దర్శకుడు హరీశ్ శంకర్ కు పడదనే విషయం బహిరంగ రహస్యం. గబ్బర్ సింగ్ సినిమా నుంచి వీళ్లిద్దరి మధ్య అభిప్రాయబేధాలున్నాయి. హరీశ్ కు తను ఆఫర్ ఇవ్వకపోతే రోడ్డుపై ఉండేవాడనే అర్థం వచ్చేలా అప్పట్లో బండ్ల స్పందించాడు. దానికి హరీశ్ కూడా పరోక్షంగా, కాస్త ఘాటుగానే ప్రతిస్పందించాడు.
ఇలా వీళ్లిద్దరి మధ్య నడిచిన మాటలయుద్ధం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. అంతెందుకు, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కూడా హరీశ్ పై పరోక్షంగా కామెంట్స్ చేశాడు బండ్ల. అన్నం పెట్టే నిర్మాత ఇండస్ట్రీకి వెన్నెముక అని, అలాంటి నిర్మాతను తక్కువ చేసి చూడడం కరెక్ట్ కాదంటూ ఏదేదో మాట్లాడాడు. అయితే దానిపై హరీశ్ మాత్రం రియాక్ట్ అవ్వలేదు.
ఇలా ఎడమొహం-పెడమొహంగా ఉంటున్న వీళ్లిద్దరూ సడెన్ గా కలిసిపోయారు. అవును.. మీరు వింటున్నది నిజం. బండ్ల-హరీశ్ కలిసిపోయారు. గబ్బర్ సింగ్ సినిమా విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా హరీష్ కు ఓ మంచి గిఫ్ట్ ఇచ్చాడు బండ్ల. 4-5 లక్షల ఖరీదు చేసే వాచీ అతడి చేతికి తొడిగాడు.
ఈ బహుమతిపై మురిసిపోయిన హరీశ్ కూడా థ్యాంక్యూ సర్ అంటూ స్పందించాడు. బండ్లగణే ను సర్ అని సంబోధించాడు. ఈ ఒక్క మీటింగ్ తో వీళ్లిద్దరి మధ్య ఉన్న అభిప్రాయబేధాలన్నీ సమసిపోయాయి. ఇక కలిసి సినిమా చేయడమే ఆలస్యం.