లుంగీ కట్టుకుని సినిమా థియేటర్ కు వెళ్లిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. లుంగి కట్టుకుని సినిమాకు చూసేందుకు వెళ్లిన తనకు టికెట్ నిరాకరించారంటూ ఓ వ్యక్తి ఆరోపణలు చేశాడు.
ఈ ఆరోపణలు బంగ్లాదేశ్ లో తీవ్ర చర్చకు దారి తీశాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
ఆయనకు సంఘీభావంగా పలువురు లుంగీలు కట్టుకుని థియేటర్‌కు వెళ్లారు. అక్కడ ఆందోళనలు నిర్వహించారు. దీంతో ఆ థియేటర్ యాజమాన్యం దిగొచ్చింది.
జరిగిన ఘటనపై థియేటర్ యాజమాన్యం వివరణ ఇచ్చింది. సదరు వ్యక్తికి తన కుటుంబంతో సహా అదే థియేటర్‌లో సినిమా చూసేందుకు యాజమాన్యం అవకాశం కల్పించింది.
బంగ్లాదేశ్‌లో సమన్ అలీ సర్కార్ అనే వ్యక్తి ప్రముఖ మల్టీప్లెక్స్ ‘స్టార్ సినీప్లెక్స్’లో సినిమా చూసేందుకు లుంగీ ధరించి వచ్చారు. కానీ లుంగీ కట్టుకుని వచ్చినందుకు తనకు టికెట్ నిరాకరించారంటూ ఆయన ఆరోపణలు చేశారు.
ఆయన వ్యాఖ్యానించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. దీంతో ఈ అంశంపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. వస్త్రధారణ ఆధారంగా వినియోగదారుల పట్ల తాము ఎలాంటి వివక్ష చూపడం లేదని పేర్కొంది.
సదరు వ్యక్తి తమను అపార్థం చేసుకోవడం వల్లే ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిందని, జరిగిన దానికి చింతిస్తున్నామని సంస్థ వెల్లడించింది. సర్కార్ తో పాటు ఆయన కుటుంబాన్ని కూడా అదే థియేటర్ లో సినిమా చూసేందుకు ఆహ్వానించింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన అధికారిక ఖాతాలో పంచుకుంది.