బంగ్లాదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చిట్టగాంగ్ లోని షిప్పింగ్ కంటైనర్ డిపోలో భారీ రసాయన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 35 మంది మరణించారు.
సుమారు 450 మంది గాయపడినట్టు అధికారులు తెలిపారు. కంపెనీలో శనివారం రాత్రి రసాయనాల కారణంగా మంటలు సంభవించాయని ప్రాథమికంగా తేలినట్టు చెప్పారు.
9 గంటలకు మొదలైన మంటలు అర్ధరాత్రి సమయానికి పెద్ద ఎత్తున వ్యాపించాయని, ఆ తర్వాత భారీ పేలుడు సంభవించినట్టు వివరించారు. ఆ తర్వాత మంటలు ఆ ప్రాంతమంతటా వ్యాపించాయని అధికారులు పేర్కొన్నారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు 20 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.