సాధారణంగా బ్యాంక్ దోపిడీ అంటే దొంగలు రక రకాలుగా అందుకు మార్గాలను వెదుకుతుంటారు. కొందరు రాత్రి పూట బ్యాంక్ తలుపులు లేదా గోడలను బద్దలు కొట్టి లోపల ప్రత్యేక గదుల్లో ఉండే నగదును దోచేస్తారు. కొందరు పట్టపగలే ఆయుధాలను చూపి బెదిరించి డబ్బును కాజేస్తారు. అయితే ఆ దొంగలు మాత్రం చాలా వెరైటీగా బ్యాంకులోని డబ్బును దోచేశారు. వారు ఎలా ఆ డబ్బును దొంగిలించారో తెలిస్తే నిజంగానే షాకవుతారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?
బ్రెజిల్‌లోని ది బ్యాంకో సెంట్రల్ బ్యాంక్‌లో జరిగిందా దోపీడీ. మొత్తం 25 మంది వ్యక్తులు ఆ బ్యాంకులో డబ్బును దోచేశారు. అయితే అందుకు గాను వారు బ్యాంకుకు సమీపంలోనే ఓ ప్రాపర్టీని అద్దెకు తీసుకుని అందులో బేస్‌బాల్ క్యాప్‌లను అమ్ముతున్నట్లు నటించారు. జనాలు నమ్మేందుకు వారు ప్రకటనలు కూడా ఇచ్చారు. అయితే 3 నెలల పాటు వారు అలా బిజినెస్ చేస్తున్నట్లు నటించారు. కానీ వారు తాము ఉంటున్న ప్రాపర్టీ కింది నుంచి భూగర్భంలో ఆ బ్యాంకు వరకు ఒక సొరంగం తవ్వారు.
అలా వారు 3 నెలల పాటు కష్టపడి మరీ 80 మీటర్ల సొరంగం తవ్వారు. అందులో వారు ఎలక్ట్రిక్ లైట్లు, గోడలకు చెక్కతో చేసిన వాల్ ఫిటింగ్స్, ఏసీని కూడా అమర్చారు. ఇక ఆ సొరంగం ద్వారం 70 చదరపు సెంటీమీటర్ల వైశాల్యం ఉంటుంది. భూమి నుంచి 4 మీటర్ల లోతుకు ఆ సొరంగాన్ని తవ్వారు. అనంతరం వారు అందులోంచి బ్యాంకు లోపలికి చాలా తేలిగ్గా వెళ్లి, అందులోని వాల్ట్‌లో ఉన్న నగదను కాజేశారు.
బ్యాంకులోని వాల్ట్‌లో పాత, కొత్త నోట్లు ఉన్నా.. కొత్త నోట్లకు సీరియల్ నంబర్లు ఉంటాయి కనుక వాటిని ట్రేస్ చేయడం సులభతరమవుతుందని భావించిన ఆ దొంగలు పాత నోట్లను కొట్టేశారు. మొత్తం 40 మిలియన్ పౌండ్లను దొంగిలించారు. అయితే దొంగతనం ఎలా చేశారో పోలీసులు తరువాత కనిపెట్టారు కానీ.. దొంగతనం చేసిన వ్యక్తులను మాత్రం వారు చాలా రోజులకు కూడా పట్టుకోలేకపోయారు. చాలా రోజుల అనంతరం ఆ 25 మందిలో కేవలం 8 మందిని అరెస్టు చేయగలిగారు. వారి నుంచి చాలా తక్కువ మొత్తంలో డబ్బును రికవరీ చేశారు. ఇక మిగిలిన వారు ఏమయ్యారో, ఆ డబ్బు ఏమైందో కూడా తెలియదు. దీంతో ఆ కేసు అలా పెండింగ్‌లో పడిపోయింది. ఇది చాలా కాలం క్రితం జరిగినప్పటికీ ప్రపంచంలో ఇప్పటి వరకు చేసిన అత్యంత భారీ బ్యాంకు దోపిడీల్లో ఒకటిగా మిగిలిపోయింది.