–టూరిస్ట్ లు రాకపోవడంతో అమ్మకానికి బస్సులు
–కేజీల లెక్కన పాత ఇనుప దుకాణాలకు చేరుతున్న టూరిస్ట్ బస్సులు
–కేజీకి రూ. 45 చొప్పున అమ్మకానికి సిద్ద పడ్డ యజమానులు
–కరోనా కారణంగా బంద్ అయిన టూరిస్ట్ ల రాకపోకలు
–కరోనా దెబ్బకు కన్నీరు పెట్టుకుంటున్న టూరిస్ట్ సంస్థలు
కరోనా.. కరోనా.. కరోనా ఇప్పుడున్న పరిస్ధితుల్లో కరోనా తప్పితే వేరే ఏ ఆలోచన లేదు జనానికి. ఎవరి నోట విన్నా కరోనా మాట తప్పితే వేరే పథమే రావట్లేదు. ఎక్కడ చూసినా కరోనా కేసుల గురించే తప్పితే మరో సంభాషణే లేదు. ఈ మాయదారి కరోనా కారణంగా దేశంలోని అనేక రంగాలు కుదేలయ్యాయి. కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ విధించడంతో చాలా మంది ఉపాధిని కోల్పోయారు. దీంతో వాటిమీద ఆధారపడి జీవించే కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక ఇబ్బందులతో వేలాది మంది ప్రాణాలు తీసుకున్నారు. అందులో ప్రధానంగా టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ కూడా ఉంది.
నిజానికి కేరళలో టూరిస్టులు వస్తూ పోతుండేవారు. దీంతో అక్కడ పర్యాటకుల రాకపోకలతో టూరిస్ట్ బస్సులను నడిపే సంస్థలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుండేది. కానీ.. కరోనా కారణంగా పర్యాటకుల సంఖ్య తగ్గిపోయింది. దాంతో అక్కడ ట్రావెల్స్ యజమానులు తీవ్రంగా నష్టపోయారు. కంపెనీలు దివాళ తీయడంతో ఆ బస్సులను అమ్మేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఆ బస్సులను ఎవరు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో ఓ ట్రావెల్స్ యజమాని తన వద్దనున్న 10 లగ్జరీ ట్రావెల్స్ బస్సులను కేజీకి రూ.45ల చొప్పున పాత ఇనుప సామాను కొట్టులో అమ్మకానికి పెట్టాడు.
కొచ్చికి చెందిన రాయిసన్ జోసెఫ్ గతంలో 20 బస్సులతో టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థను నడిపించేవాడు. టూరిస్టుల రాకతో సంస్థ లాభదాయకంగా నడిచేది. ఆ సంస్థ ద్వారా తనతో పాటు మరో 50 మందికి జోసెఫ్ ఉపాధినిచ్చేవాడు. అయితే.. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో పర్యాటకుల సంఖ్య తగ్గింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అక్కడ పర్యాటక పరిశ్రమ సంక్షోభంలోనే ఉంది. దాంతో వాటి మెయింటనెన్స్ భరించలేక.. జోసెఫ్ ఇప్పటికే 10 బస్సులను అమ్మేశాడు.
ఇటీవల కరోనా ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకున్న జోసెఫ్.. పర్యాటకుల రాకతో వ్యాపారం బాగా సాగుతుందనుకున్నాడు. కనీసం మూడు బస్సులు కూడా నిండకపోవడంతో తల పట్టుకున్నాడు. దానికి తోడు ట్యాక్స్ లు, సిబ్బంది జీత భత్యాలు తలకు మించిన భారంగా మారాయి. తన వ్యాపారాన్ని కొనసాగించలేకపోయిన జోసెఫ్.. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి మిగిలిన బస్సులను కేజీల లెక్కన అమ్మకానికి పెట్టాడు. గత్యంతరం లేని స్థితిలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు జోసెఫ్ వెల్లడించాడు. అయితే.. కేరళలో మిగతా ట్రావెల్స్ కంపెనీల పరిస్థితి కూడా ఇలానే ఉన్నట్టు తెలుస్తోంది.