దేశ ప్రధాని నరేంద్ర మోడీ గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, తెలంగాణకు కేంద్రం ఇవ్వాల్సిన అంశాలపై ప్రధానిని ప్రశ్నిస్తూ హైదరాబాద్ నగరంలో పలు చోట్ల బ్యానర్లు వెలిశాయి.
తెలంగాణకు కేంద్రం ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారని బ్యానర్ల ద్వారా మోడీని నిలదీశారు. సదరు బ్యానర్లు ఒక్కో అంశానికి సంబంధించిన కేంద్రం హామీలపైన ఉన్నాయి. ఇక ఈ బ్యానర్లు చూసి ప్రధానిని వినూత్నంగా ప్రశ్నిస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.
కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణకు ఎప్పుడు వస్తుందని ఓ బ్యానర్‌లో ప్రశ్నించారు. మరో బ్యానర్‌లో తెలంగాణ ఫార్మా సిటీకి ఆర్థిక సాయం చేయరా? అని అడిగారు. నిజామాబాద్‌కు పసుపు బోర్డు ఎందుకు మంజూరు చేయలేదని, నీతి ఆయోగ్ సిఫారసు చేసినా ‘మిషన్ భగీరథ’ ప్రాజెక్టుకు కేంద్రం ఎందుకు డబ్బులు ఇవ్వలేదని ఇలా దాదాపుగా కేంద్రం ఇవ్వాల్సిన అంశాల గురించి బ్యానర్లు కట్టారు.
ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న అంశాలనూ కేంద్రం నెరవేర్చలేదని గత కొంత కాలంగా ప్రతిపక్ష పార్టీల నేతలు చెప్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన అంశాలపైన ఈ విధంగా బ్యానర్లు వెలిశాయి. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, కాళేశ్వరం ప్రాజెక్టుకు లేదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, హైదరాబాద్ వరద బాధితులకు సాయం వంటి అంశాలపైన బ్యానర్లను కట్టారు. బ్యానర్ల రూపంలో అడిగిన ఈ ప్రశ్నలకు బీజేపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి..