హైదరాబాద్ బన్సీలాల్‌పేటలోని అత్యంత పురాతనమైన మెట్ల బావి రూపు రేఖలు మారిపోయాయి. పూర్తిగా మరుగున పడిపోయిన శతాబ్ధాల చరిత్ర కలిగిన మెట్ల బావి రీస్టోరేషన్ పనులను పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. సోమవారం ఈ చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకున్న బన్సీలాల్‌పేట మెట్ల బావిని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
పూర్తిగా చెత్తాచెదారంతో పూడుకుపోయిన ఈ బావి పునరుద్ధరణ పనులను 2021 ఆగస్టు 15న ప్రారంభించారు. సుమారు 500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించారు. కండ్లు చెదిరేలా పర్యాటక హంగులు కల్పించారు. విద్యుద్దీపాలు అలంకరించి.. ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు వీలుగా అంపీ థియేటర్, పూడికతీత తొలగింపు సందర్భంగా లభ్యమైన వివిధ రకాల పరికరాల ప్రదర్శన కోసం గ్యాలరీ, చక్కటి పచ్చదనంతో కూడిన గార్డెన్‌ను ఏర్పాటు చేశారు.
17వ శతాబ్దం నాటి పురాతన కోనేరు బావిని పునరుద్దరించాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగానే బన్సీలాల్ పేటలోని పురాతన బావి రీస్టోరేషన్ పనులను మంత్రి తలసాని, హెచ్ఎండీఏ చీఫ్ అరవింద్ కుమార్ తోపాటు సందర్శించి రీస్టోరేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయించారు.సనత్‌నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేటలో కొన్ని శతాబ్దాల పాటు సేవలందించి, దశాబ్దాలుగా నిరాదరణకు గురై.. రూపు రేఖలు కోల్పోయిన చారిత్రక మెట్లబావి ఇప్పుడు తెలంగాణ సరారు చొరవతో మళ్లీ జీవం పోసుకుంది. పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకుందినిజాం రాజులు తాగునీటి కోసం కట్టించిన బన్సీలాల్‌పేట మెట్ల బావి రాష్ట్ర ప్రభుత్వం, రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ చొరవతో పునర్జీవం పోసుకున్నది.
ఈ బావి సామర్థ్యం 22లక్షల లీటర్లు. నీళ్లు ఎంత కిందికి వెళ్లినా.. మెట్ల ద్వారా కిందకు దిగి.. కుండ లేదా బిందెతో మంచి నీళ్లు తోడుకోవచ్చు. అయితే కాలక్రమేణా చెత్తా చెదారం నిండిపోయింది.మట్టితో పూడుకుపోయిన బన్సిలాల్‌పేట మెట్ల బావిలో పూడిక తీస్తున్న కొద్ది చెత్తా, చెదారంతో పాటు మట్టీ, పురాతన వస్తువులు బయటపడ్డాయని హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.50 ఫీట్ల లోతు వరకు ఉన్న బావి లోపలి నుంచే ఓ నిరంతర నీటి ఊట ఉంది. 55 ఫీట్ల కింద నుంచే వస్తున్నట్టు గుర్తించారు. ప్రతి రోజు తెల్లారేసరికల్లా కనీసం 6 ఫీట్ల నీరు ఆ బావిలో చేరుతోందని రెయిన్ వాటర్ ప్రాజెక్టు ఫౌండర్ కల్పన రమేశ్ చెప్పారు.
ప్రస్తుతం 53 అడుగుల మేర ఊట నీరుతో మెట్లబావి కళకళలాడుతున్నది.సికింద్రాబాద్ ప్రజల తాగునీటి కోసం బన్సీలాల్‌పేటలోని మెట్ల బావిని అసఫ్-జాహీ వంశస్తులు ఆరు అంతస్తుల లోతు, మెట్లు, స్తంభాలతో అద్భుతంగా నిర్మాణం చేశారు. ఊటనీరుతో నిండి మోట ద్వారా నీటిని పైకి లాగడానికి ఏర్పాట్లు కూడా ఉండేవి. ఈ బావిని 1933లో పునరుద్ధరించారు.పరదేశ పాలకుల హయాంలో పునరుద్దరణ పనులకు సేట్ బన్సీలాల్ అనే వ్యాపారి ఆర్థిక సహకారం అందించారని అందుకే మెట్ల బావి ఉన్న ప్రాంతానికి బన్సీలాల్‌పేట్‌గా పేరు వచ్చిందంటారు స్థానికులు.
ఎంతో చరిత్ర కలిగిన పురాతన భావిని భావితరాలకు చూపించాలనే ప్రభుత్వం రీస్టోరేషన్ పనులు పూర్తి చేసింది.బావి పక్కనే ఉన్న మైదానంలో పాత భవనం తొలగించి, కొత్తగా టూరిస్ట్ ప్లాజా భవనం నిర్మించి, ల్యాండ్‌స్కేప్ గార్డెన్‌ను తీర్చిదిద్దారు. ప్రతి ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఒక ఓపెన్ యాంపీ థియేటర్, బావిలో నుంచి వెలికితీసిన పురాతన పరికరాల ప్రదర్శన, బావి చరిత్రను వివరించే ఫొటో ప్రదర్శనకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు