కేంద్ర మాజీ మంత్రి దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బాన్సురీ స్వరాజ్ ఢిల్లీ బీజేపీ లీగల్ సెల్ కో-కన్వీనర్ గా నియమితులయ్యారు. క్రియా శీల రాజకీయాల్లో ప్రవేశించారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షునిగా వీరేందర్ సచ్ దేవా బాధ్యతలు చేబట్టాక ఆయన చేసిన తొలి నియామకం ఇది. బాన్సురీ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని, పార్టీని ఆమె బలోపేతం చేస్తారని నమ్ముతున్నానని ఆయన ఓ లేఖలో పేర్కొన్నారు.
ఇక ప్రధాని మోడీతో బాటు బీజేపీ నేతలకు ధన్యవాదాలు తెలిపిన బాన్సురీ స్వరాజ్.. పార్టీకి ఇలా సేవ చేసేందుకు దక్కిన అదృష్టంగా దీన్ని భావిస్తున్నానన్నారు. ప్రస్తుతం ఈమె సుప్రీంకోర్టులో అడ్వొకేట్ గా పాక్టీసు చేస్తున్నారు.
2007 లో ఢిల్లీ బార్ కౌన్సిల్ లో చేరారు. న్యాయవాద వృత్తిలో 16 ఏళ్ళ అనుభవం ఉన్న ఈమె.. వార్విక్ యూనివర్సిటీ నుంచి బీఏ డిగ్రీ పొందారు. లండన్ లోని బీపీపీ లా స్కూలులో లా పూర్తి చేసి బారిస్టర్ గా అర్హత పొందారు.
ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సెయింట్ కేథరిన్ కాలేజీలో మాస్టర్ పూర్తి చేసిన బాన్సురీ స్వరాజ్ సేవలు తమ పార్టీకి పూర్తిగా ఉపయోగపడుతాయని బీజేపీ భావిస్తోంది. గతంలో కూడా తాను పార్టీ లీగల్ వ్యవహారాల్లో తోడ్పాటు నందిస్తూ వచ్చానని బాన్సురీ తెలిపారు.