నర్శింహారెడ్డి, జర్నలిస్ట్
టీవీ ఛానెల్స్ రేటింగ్ BARC అనే సంస్థ ప్రకటిస్తుంది. టీవీ వీక్షకులలో వివిధ ఆర్థిక నేపథ్యం ఉన్నవారి ఇళ్లల్లో మానిటరింగ్ బాక్సులు బిగించి, ఏ అరగంట, ఏ ఛానల్ వీక్షిస్తున్నారో డేటా సేకరించి ప్రతివారం advertizerలకు ఈ సమాచారాన్ని అందిస్తారు. అయితే BARC వారికి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద తలనొప్పి వచ్చిపడింది. ఆరు న్యూస్ ఛానెల్స్‌కు సంబంధించిన పెద్దలు బార్క్ మీటర్లు వున్న ఇళ్లకు వెళ్లి తమ ఛానల్‌ను ఎక్కువ సేపు చూడాలని లంచం ఇస్తున్నట్టుగా బార్క్ సంస్థ పసిగట్టింది. ఈ న్యూస్ ఛానెళ్లతో పాటు, ఎంటర్‌టైన్మెంట్ ఛానెళ్లకు సంబంధించిన ప్రోగ్రాం ప్రొడ్యూసర్లు కూడా లంచాలు ఇచ్చే కార్యక్రమంలో ముందున్నారని బార్క్ కనిపెట్టేసింది. దాంతో ఈ అవకతవకలను అరికట్టడంపై బార్క్ ఫోకస్ పెట్టింది. రంగంలోకి దిగి తగిన నివారణ చర్యలు చేపట్టాలని సంకల్పించింది. ఎన్నిసార్లు చెప్పినా వినని న్యూస్ ఛానెల్స్ రేటింగ్స్‌పై సీలింగ్ విధించాలని, అంటే వారి రేటింగ్స్‌లో ఓ స్థాయి మించి పెరగకుండా చూడాలని బార్క్ నిర్ణయించింది. తెలుగులో ఒక ఆరు న్యూస్ ఛానెల్స్‌కు ఫైన్ విధించిన బార్క్, మీటర్లు వున్న ఇళ్లల్లో లంచం ఇవ్వడం మానుకోకుంటే కానీ వారి రేటింగ్స్ ఇక పెరగవని తేల్చిచెప్పింది.
ఇక రేటింగ్స్ వ్యవస్థను పూర్తి స్థాయిలో పటిష్ఠపరుస్తామని చెప్పిన బార్క్, TV9 కార్యక్రమాలలో పస తగ్గిందని గమనించి ఆ ఛానల్ రేటింగ్‌లను గణనీయంగా తగ్గించింది. బార్క్ రాడార్‌లో వున్న ఛానెల్స్ తాము అడ్డదారులు తొక్కబోమని ఆ సంస్థకు హామీ ఇచ్చి సమస్యను పరిష్కరించుకుంటాయో.. లేదో చూడాలి. ఇక, ఎంటర్టైన్మెంట్ ఛానెళ్లలో డబ్బులు పంచుతున్న ప్రోగ్రామ్స్‌కు రేటింగ్స్ గణనీయంగా తగ్గడంతో వారు కూడా తమ దారి మార్చుకుంటారని బార్క్ భావిస్తోంది. ఈ చర్యలతో తెలుగు టీవీ పరిశ్రమలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.