ప్రభుత్వ స్కూళ్లు, హాస్టల్స్ లో భోజన వసతులు ఎలా ఉంటాయో చూస్తూనే ఉన్నాం. వారానికో ఫుడ్ పాయిజన్ ఘటన ఒకటన్న ఎక్కడో ఒక చోట వెలుగుచూస్తూనే ఉంది. ఈమధ్య బాసర ట్రిపుల్ ఐటీలో జరిగిన ఘటన.. అక్కడి పరిస్థితులు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపాయి. ఈ క్రమంలోనే వరంగల్ జిల్లా ఎల్గూర్ రంగంపేట్ కు చెందిన సంజయ్ కిరణ్ అనే విద్యార్థి మరణించడం కలకలం రేపుతోంది.
సంజయ్ ట్రిపుల్ ఐటీలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. తల్లిదండ్రులు శ్రీధర్, శ్రీలత. వ్యవసాయ కుటుంబం. సంజయ్ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆస్పత్రికి వెళ్లాలని జూన్ లో కాలేజీ అధికారుల నుంచి అనుమతి తీసుకుని ఇంటికి వచ్చాడు. కొద్దిరోజుల పాటు వరంగల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని పరీక్ష రాసేందుకు కాలేజీకి వెళ్లాడు.
పరీక్షలు వాయిదా పడటంతో మళ్లీ ఇంటికి వచ్చేశాడు. ఈ క్రమంలోనే మరోసారి అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు ఈ నెల 16న హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స కోసం ఉన్నదంతా అమ్మేసి రూ.16 లక్షల వరకు ఖర్చు పెట్టారు. కానీ.. ప్రాణం దక్కలేదు. ట్రీట్ మెంట్ పొందుతూ సంజయ్ మరణించాడు.
సంజయ్ మృతికి కొన్నాళ్లుగా అతను తీసుకుంటున్న ఆహారమే కారణమని డాక్టర్లు తేల్చారు. సరైన తిండి లేకే అతడి అవయవాలు దెబ్బతిన్నాయని.. వైద్యులు చెప్పినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ట్రిపుల్ ఐటీ మెస్ లో తిండి వల్లే తమ బిడ్డ అనారోగ్యం పాలయ్యాడని.. ఇప్పుడు మృత్యు ఒడికి చేరాడని వాపోతున్నారు.