ట్రిపుల్ ఐటీ కాలేజీలో సమస్యలు పరిష్కరించాలంటూ ఏడురోజులుగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు విరమించారు విద్యార్థులు. విద్యార్ధులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి జరిపిన చర్చలు సఫలం కావడంతో సోమవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో నిరసనలను విరమిస్తూ.. హాస్టళ్లకు వెళ్లారు. చర్చల అనంతరం బయటకు వచ్చిన విద్యార్థులు మీడియాతో మాట్లాడారు.
ఒక్కొక్కటిగా తమ సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇవ్వడంతో తాము ఆందోళనను విరమిస్తున్నామని తెలిపారు. వీసీ నియామకంతో సహా అన్ని సమస్యలను ప్రాధాన్య క్రమంలో పరిష్కరిస్తామని మంత్రి భరోసానిచ్చినట్లు విద్యార్థులు వివరించారు. మరోవైపు తక్షణమే రూ.5.6 కోట్ల నిధులను విడుదల చేస్తామని నిర్మల్ కలెక్టర్ ప్రకటించారు.
వారంగా జరుగుతున్న చర్చలు విఫలమవ్వడంతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి రంగంలోకి దిగారు. సోమవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో విద్యాలయ వీసీ రాహుల్ బొజ్జా, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణ, డైరెక్టర్ సతీష్ కుమార్, విద్యాశాఖ కమిషనర్ వాకాటి కరుణ, స్థానిక ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ, ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌లతో విద్యాలయానికి వచ్చారు.
తొలుత అధికారులతో చర్చించిన తర్వాత 20 మంది ఎస్‌జీసీ విద్యార్థులతో ఆడిటోరియంలో చర్చలు ప్రారంభించారు. అర్ధరాత్రి వరకు చర్చలు సాగాయి. విద్యార్థుల డిమాండ్లను దశల వారీగా నేరవేర్చుతామని.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులకు తెలిపారు. నెల రోజుల్లో వీసీని నియమిస్తామని సబితా ఇంద్రారెడ్డి హామీనిచ్చారు.
దీంతో ఆందోళనను విరమిస్తున్నట్లు విద్యార్థులు ప్రకటించారు. విద్యార్ధులు చేస్తున్న నిరసనలు విరమించడంతో.. మంగళవారం నుండి ట్రిబుల్ ఐటీలో తరగతులు ప్రారంభమయ్యాయి. విద్యార్ధులు తమతమ క్లాసులకు హాజరయ్యారు. ప్రభుత్వం, అధికారులు చెప్పినట్టు తమ సమస్యలు పరిష్కారం కాకపోతే.. మరోసారి ఉద్యమాన్ని చేపడుతామని హెచ్చరించారు విద్యార్ధులు.