కర్ణాటకలో డిగ్రీ, డిప్లొమా కాలేజీల రీ ఓపెనింగ్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. ప్రస్తుత పరిస్థితులను నిశీతంగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. హిజాబ్ పై హైకోర్టు తీర్పు వెలుపడిన తర్వాతే ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.’
‘ ప్రస్తుతానికి కాలేజీల ఓపెనింగ్ కు సంబంధించి ఎలాంటి షెడ్యూల్ లేదు. రాష్ట్ర హైకోర్టు సోమవారం ఎలాంటి తీర్పు ఇస్తుందోనని మేము ఎదురు చూస్తున్నాము. మా మంత్రులు, విద్యాశాఖ మంత్రి పరిస్థితులను సమీక్షిస్తారు. అనంతరం దానిపై ఓ నిర్ణయానికి వస్తాము” అని తెలిపారు.
ప్రీ యూనివర్సిటీ కాలేజీలకు సెలవులను కర్ణాటక ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఫిబ్రవరి 9 నుంచి 15 వరకు కళాశాలలను మూసివేయనున్నారు. అదేవిధంగా డిగ్రీ, డిప్లొమా కళాశాలను ఫిబ్రవరి 16వరకు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నది.
హిజాబ్ వివాదానికి సంబంధించి పలు పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు వాదనలు వింటోంది. దీనికి సంబంధించి శుక్రవారం పలు ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు ప్రస్తుతానికి కళాశాలలను తెరవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసులో తుది తీర్పు వెల్లడించే వరకు హిజాబ్ ధరించి కళాశాలకు హాజరయ్యేలా ముస్లిం విద్యార్థినులకు ఎలాంటి మినహాయింపులు ఉండబోవని హైకోర్టు వెల్లడించింది.